నేపాల్ లో చైనా వ్యతిరేక నిరసనలు
ఖాట్మాండూ జూన్18
గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో నేపాల్లో పలువురు శాంతి కాముకులు నిరసన చేపట్టారు. చైనా శాంతిని ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. గాల్వన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై పలు దేశాలు విచారం వ్యక్తం చేశాయి. భారత్లో ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీలోని చైనా ఎంబసీ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇదే తరహాలో నేపాల్లోనూ నిరసన చేపట్టారు. కాట్మండ్లోని చైనా ఎంబసీ వద్ద కొంత మంది నిరసన వ్యక్తం చేశారు. చైనా శాంతిని ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. యుద్ధం నేరమంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నేపాల్ గత కొంతకాలంగా భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్లోని భూభాగాలను కలుపుతూ నేపాల్ రూపొందించిన కొత్త మ్యాప్ను కూడా ఆ దేశ పార్లమంట్ ఆమోదించింది. భారత్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. తమకు భారత్ నుంచి వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ మరింత ప్రమాదకరం అంటూ నేపాల్ ప్రధాని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రోద్బలంతోనే ఇవన్నీ జరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్కు సానుకూలంగా, చైనాకు వ్యతిరేకంగా నేపాల్ వాసులు నిరసన చేపట్టడం చర్చనీయాంశం.