తెలుగుదేశం పార్టీ సొంతగూటిలో నేతల మధ్య గొడవలతో రచ్చకెక్కుతోంది. ఇప్పటికే హోదా విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారనే అపవాదు నుంచి బయటపడేందుకు అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఓపక్క అన్నివిధాలా ఆదుకుంటామన్న కేంద్రం ఆదుకోకుండా, ఆడుకుంటుంటే ఎలా అయినా ఆంధ్రా కి జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్ళి ఎలా అయినా నిధులు రాబట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే ఆయన మంత్రివర్గం లోని వారే ఆయన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్నటికి మొన్న అయ్యన్న-గంటా ల మధ్య ఉన్న విభేదాలు బయటకి వస్తే ఇప్పుడు మంత్రి అఖిల ప్రియ పార్టీనేత ఏవీ సుబ్బారెడ్డి ల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి.వారిద్దరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి… ఏకంగా ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, సమస్యలన్నీ నాకే చెప్పుకోండి అంటూ సుబ్బారెడ్డి ప్రచారం చేస్తుండడం, తన పోరాటం అఖిలప్రియ మీదే అంటూ ఏవీ పబ్లిగ్గానే ప్రకటిస్తూ వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినని చెబుతుండడం అఖిలప్రియకు మింగుడు పడడంలేదు. పరిస్థితి ఇంతదాకా వచ్చిన నేపథ్యంలో చంద్రబాబుకి ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో అఖిలప్రియ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో మరో నాయకుడి పెత్తనం గురించి పట్టించుకోకపోవడంతో కలత చెందినట్టు భావిస్తున్నారు. అందుకే ఆమె అలకబూనినట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి వైఖరితో అలక పాన్పు ఎక్కిన అఖిలప్రియ పార్టీ-ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.ఊరువాడా.. దండోరా వేయించి హోదా తప్పిదంలో కేంద్రం తప్పిదంపై జనానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే.. హోదా ఎఫెక్ట్ రాబోయే ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపుతుంది కూడా. కానీ.. ఏపీలో దేశం నేతలు మాత్రం.. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా తెదేపాకు కీలకమైన విశాఖ, కర్నూలు జిల్లాల్లోనే ఇటువంటి పరిస్థితి రావటమే కంటగింపుగా మారింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మీ నాన్న బతికుంటే.. ఈ చెంపల పగులగొట్టేవాడంటూ అఖిలపై సుబ్బారెడ్డి ఘాటుగానే స్పందించారు. దీంతో మా నాన్న చనిపోయినపుడు కూడా తాను కన్నీరు పెట్టుకోలేదంటూ బోరున విలపించింది అఖిల. ఇది ఇద్దరి మధ్య దూరం పెంచటమే కాదు. పార్టీ శ్రేణుల్లోనూ అయోమయానికి దారితీసింది. ఇప్పటికే అక్కడ చక్రపాణి సోదరులు అదను కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయలో రాజకీయంగా ప్రతిపక్షం తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే ఆందోళన కూడా తెలుగు తమ్ముళ్ల నుంచి వ్యక్తమవుతోంది. ఇక ఇటు కోస్తాలో.. సైలెంట్‌గా వున్న మంత్రి గంటా. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మధ్య విబేధాలు మరోసార తెరమీదకు వచ్చాయి. నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో అయ్యన్న చెప్పిన వారికి పదవి ఇవ్వలేదనే అక్కసువెళ్లగక్కారు. పనిలో పనిగా.. గంటాపై ఘాటైన విమర్శలే చేశారు. మంత్రి పదవి కోసం పార్టీలు మారి ఏమార్చే రాజకీయాలు చేస్తున్నారంటూ స్పందించారు. అయితే దీనిపై గంటా నుంచి ఎటువంటి కామెంట్స్ రాకపోవటంతో గొడవ సద్దుమణిగినట్లుగానే భావిస్తున్నారు. కానీ.. ఇద్దరి మధ్య వైరం అంతర్గతంగా పార్టీపై ప్రభావం చూపుతుందనే వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పటికే కృష్ణాలో టీడీపీ నుంచి కృష్ణప్రసాద్, యలమంచలి రవి వంటి నేతలు వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు అంతర్గత తగాదాలు రోడ్డుపైకిచేరితే.. పార్టీలో లుకలకలు ప్రజల్లోకి ప్రతికూల ఆలోచనలు చేర్చే అవకాశాలున్నాయి.