సర్జపై ఎమోషనల్ పోస్ట్
బెంగళూర్, జూన్ 19
ఇటీవల కన్నుమూసిన కన్నడ యంగ్ హీరో చిరంజీవి సర్జ భార్య మేఘన రాజ్ తన భర్తను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రతి ఒక్కరి గుండెను హత్తుకుంటోంది.శాండిల్‌వుడ్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జ ఆకస్మిక మరణం ఆయన అభిమానులతో పాటు యావత్తు కన్నడ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడలో ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.. జూన్ 7న గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన వయసు 39 సంవత్సరాలు. చిరంజీవి మరణం ఆయన భార్య మేఘనకు తీరని గుండెకోతను మిగిల్చింది.నటి మేఘన రాజ్‌ను చిరంజీవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దర్శకుడు సుందర్ రాజ్, నటి ప్రమీల జోషాయి దంపతుల కుమార్తె ఈ మేఘన రాజ్. చిరు, మేఘనల వివాహం 2018లో జరిగింది. ప్రస్తుతం మేఘన మూడు నెలల గర్భవతి. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతోన్న మేఘన.. చిరును గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో గురువారం ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘‘నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు బతికే ఉంటావు. నువ్వు నాలోనే ఉన్నావు. ఐ లవ్ యు’’ అంటూ తన భర్తపై ఉన్న ప్రేమను వ్యక్త పరిచారు మేఘన. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఇదే మెసేజ్‌ను ట్వీట్ కూడా చేశారు.‘‘చిరు.. నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ, నేను నీకు చెప్పాలనుకున్న విషయానికి అక్షర రూపం ఇవ్వలేకపోతున్నాను. నా దృష్టిలో నువ్వేంటో చెప్పడానికి ఈ విశ్వంలోని పదాలన్నీ సరిపోవు. నా స్నేహితుడు, నా ప్రియుడు, నా భాగస్వామి, నా కొడుకు, నా అంతరంగికుడు, నా భర్త - వీటన్నింటికన్నా మించి నువ్వు నాకు. నువ్వు నా ఆత్మవు చిరు.నేను తలుపు వైపు చూసిన ప్రతిసారి అంతుచిక్కని నొప్పి నా ఆత్మను తాకుతోంది. ప్రతిరోజూ ప్రతి నిమిషం నేను నిన్ను తాకలేకపోతున్నానని నా మనసుకి తెలిసిపోతోంది. వెయ్యి మరణాలను చూసినంత బాధ కలుగుతోంది. కానీ, అప్పుడే ఒక మ్యాజిక్‌లా నువ్వు నా చుట్టూ ఉన్నావని నాకు అనిపిస్తోంది. నేను బలహీనంగా ఉన్నానని నాకు అనిపించిన ప్రతిసారి నువ్వు నన్ను సంరక్షించే దేవతలా నా చుట్టూ ఉంటున్నావు.నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తావు. అందుకే, నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టవు. అవునా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మన ప్రేమకు గుర్తుగా నువ్వు నాకు ఇచ్చిన అపురూపమైన బహుమతి. ఈ తీయని అద్భుతాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. నిన్ను మన బిడ్డగా మళ్లీ ఈ భూమిపైకి తీసుకురావడానికి, నిన్ను మళ్లీ ఎత్తుకోవడానికి, నీ చిరునవ్వును మళ్లీ చూడటానికి, నీ నవ్వును మళ్లీ వినడానికి వేచి ఉండలేకపోతున్నాను.నేను నీకోసం వేచి చూస్తాను, నువ్వు కూడా నా కోసం వేచి చూస్తున్నావు. నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు బతికే ఉంటావు. నువ్వు నాలో ఉన్నావు. ఐ లవ్ యు’’ అని ఎంతో భావోద్వేగంతో రాశారు మేఘన.