YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మాస్టారు...వెనక్కి తగ్గేది లేదు సార్

మాస్టారు...వెనక్కి తగ్గేది లేదు సార్

తెలంగాణ జేఏసీ  చైర్మన్ కోదండ‌రాం అంద‌రూ ఊహించిన‌ట్టుగా  కొత్తపార్టీ తెలంగాణ  జ‌న‌స‌మితిని ఏర్పాటు చేశారు. ఇటీవ‌ల పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. ఈనెల 29న హైద‌రాబాద్‌లో పార్టీ ఆవిర్భావ స‌భ నిర్వహించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ స్ఫూర్తికి, ప్రజ‌ల ఆకాంక్షల‌కు విరుద్ధంగా పాలిస్తోంద‌ని కోదండ‌రాం విమ‌ర్శిస్తున్నారు. కెసిఆర్ తమ పార్టీ ఆవిర్భావ సభకు అనుమతి ఇవ్వడం లేదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఎల్బీ స్టేడియం లేదా సరూర్‌నగర్ స్టేడియంలో సభను నిర్వహించుకొంటామని పోలీసులను అనుమతి కోరితే వారు నిరాకరిస్తున్నారని కోదండరామ్ చెప్పారు.ప్రభుత్వం అనుమతిచ్చినా ఇవ్వకపోయినా ఏప్రిల్ 29న సరూర్ నగర్ స్టేడియంలో సభను నిర్వహిస్తామని కోదండరామ్ ప్రకటించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేశాం, ఆ ఉద్యమ స్పూర్తి నుండే తెలంగాణ జనసమితి ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత‌గా వ్యవ‌హ‌రిస్తున్నార‌నీ, తెలంగాణ‌లో ప్రజాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నార‌నీ ఆయ‌న ఆరోపిస్తున్నారు. తెలంగాణ జ‌న స‌మితి జెండా ఆవిష్కర‌ణ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ ప్రగ‌తి భ‌వ‌న్ గేట్లు కూడా బ‌ద్దలు కొడతామ‌ని కోదండ‌రాం ప్రక‌టించారు.ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కోదండ‌రాం మాస్టారు కృషి ఎన‌లేనిది. కేసీఆర్ – కోదండ‌రాం క‌లిసి ఉద్యమాన్ని పీక్ స్టేజ్‌కు తీసుకువెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, ఎన్నిక‌ల‌… కేసీఆర్ సీఎం అయ్యేవ‌ర‌కు వీరిద్దరి మ‌ధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. అదే ఇప్పుడు ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే వాతావ‌ర‌ణం న‌డుస్తోంది. ఇక ఇది చిలికి చిలికి గాలి వాన‌లా మారి చివ‌రకు కోదండ రాం పార్టీ పెట్టే వ‌ర‌కు వెళ్లిపోయింది. కొత్త పార్టీ పెట్టిన కోదండ‌రాం వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ర‌ణ‌రంగ క్షేత్రంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.కోదండ‌రాం వెన‌క ఎవ‌రున్నార‌ు..? ఆయ‌న ఎవ‌రి అండ‌తో పార్టీ పెట్టారు..? ఆయ‌న‌ను ముందుకు న‌డిపిస్తున్న ఆ అదృశ్య శ‌క్తి ఎవ‌రు..? అన్నప్రశ్నలు చాలా రోజులుగా అంద‌రి మెద‌ళ్లను తొలుస్తున్నాయి. ఇదేస‌మ‌యంలో ప్రొఫెస‌ర్ కోదండ‌రాంను కాంగ్రెస్ పార్టీనే న‌డిపిస్తోంద‌ని అధికార టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. నిజానికి మొద‌టి నుంచి కోదండ‌రాం ప‌లు విష‌యాల్లో ప్రభుత్వంతో విభేదిస్తూ విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో శాస్త్రీయ‌త లేద‌నీ, వ్యవ‌సాయరంగాన్ని, నిరుద్యోగ స‌మ‌స్యను ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌నీ ఆయ‌న అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న తెలంగాణ వ్యాప్తంగా నిరంత‌రం ప‌ర్యటిస్తున్నారు.ఈ క్రమంలో కోదండ‌రాం ప‌లుమార్లు స‌భ‌లు నిర్వహించారు కూడా. అయితే ఈ స‌భ‌ల‌కు పోలీసులు మాత్రం అనుమ‌తి ఇవ్వడం లేదు. కోర్టుల్లో పిటిష‌న్లు వేయ‌డం.. ఆయ‌న అనంత‌రం అనుమ‌తి ఇవ్వాల‌ని తీర్పురావ‌డం.. ఆత‌ర్వాత ఎక్కడోఒక‌చోట స‌భ‌కు అనుమ‌తి ఇవ్వడం జ‌రిగింది. తాజాగా ఈనెల 29న తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ ఆవిర్భావ స‌భ‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. దీంతో ఆయ‌న మ‌ళ్లీ కోర్టును ఆశ్రయించారు.ఇదిలా ఉండ‌గా.. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి హ‌నుమంత‌రావు కోదండ‌రాంకు మ‌ద్దతుగా నిల‌వ‌డం గ‌మ‌నార్హం. సినిమావాళ్ల స‌భ‌ల‌కు అనుమ‌తి ఇస్తారుగానీ… ప్రజా స‌మ‌స్యల‌పై పోరాడుతున్న కోదండ‌రాం స‌భ‌కు ఎందుకు అనుమ‌తి ఇవ్వరంటూ ప్రభుత్వాన్ని ప్రశించారు. అయితే టీజేఎస్ స‌భ‌కు అనుమ‌తి ఇవ్వాలంటూ హ‌నుమంత‌రావు అన‌డంలో ఆంత‌ర్యమేమిట‌నే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోదండ‌రాం వెన‌క ఉన్నది కాంగ్రెస్సేనంటూ టీఆర్ఎస్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది. అయితే అదే కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ మాత్రం కోదండ‌రాం కేసీఆర్ పెర‌ట్లో మొక్క అని విమ‌ర్శిస్తున్నారు. మ‌రి ఈ ఆరోప‌ణ‌కు కాంగ్రెస్ వాళ్లు ఏమంటారో..?

Related Posts