భక్తాగ్రేసరుడు.. హనుమంతుడు
నమ్మకం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, అమోఘమైనవాక్చాతుర్యం, అపారమైన బుద్ధిబలం, అద్భుతమైన పాండిత్యం కలిగిన అమిత బలశాలి.. హనుమంతుడు. ఆసేతు హిమాచలం భారతావని అంతా నిత్యం స్మరించే దేవుడు. ఎంతటి పిరికి వాడయినా ఒక్కసారి హనుమను తల్చుకుంటే తక్షణమే ఎక్కడలేని మానసిక బలం వస్తుంది. లోకానికి అంతటికి వెలుగునిచ్చే సూర్యభగవానుడి శిష్యుడైన హనుమ.. సకలవిద్యాపారంగతుడు. అణిమ (అత్యంత సూక్ష్మంగా తనను తాను మలచుకోవడం), మహిమ (ఏ కార్యాన్నైనా అవలీలగా చేయగలిగే శక్తి సామర్థ్యాలు, మానవ మాత్రులకు సాధ్యం కాని మహిమలు కలిగి ఉండటం), గరిమ (శరీరాకృతిని, బరువును పెంచుకొనే సామర్థ్యం), లఘిమ (శరీర బరువును దూది కంటే తేలికగా ఉంచుకోగలగడం), ప్రాప్తి (కావాలనుకున్నవాటిని శూన్యం నుండి కూడా సృష్టించుకోగలడం), ప్రాకమ్యము (దూర దర్శనం, దూర శ్రవణం, ఆకాశగమనం వంటి దివ్యశక్తులను కలిగి ఉండటం), ఈశత్వం (ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలగడం), వశత్వం (సకల జీవరాశులనూ తాను చెప్పినట్లు నడుచుకొనేలా చేయగలిగే శక్తి).. అనే అష్టసిద్ధులను కలిగి ఉన్నప్పటికీ.. ఆ అద్భుతమైన శక్తులకు వశుడై అహం పెంచుకోకుండా అత్యంత వినయంగా రాముని బంటుగా ఉండి ధర్మం కోసం నిలిచిన భక్తాగ్రేసరుడు ఆంజనేయుడు. తన సూక్ష్మబుద్ధిచే.. సుగ్రీవునికి, రాముడికి మైత్రిని కుదిర్చి ఇద్దరూ తమ తమ సమస్యలను తీర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప సంధానకర్త. నూరు యోజనాల సముద్రాన్ని అవలీలగా లంఘించి ఎంతటి క్లిష్టమైన కార్యాన్నైనా సంకల్పబలం ద్వారాసాధించవచ్చని చూపిన మార్గదర్శి. సీతమ్మ జాడ కనుగొని రాముని పరాక్రమాన్ని రావణునికి వివరించి, వినకపోతే లంకాదహనం చేసి.. రామసేన పరక్రమాన్ని చూపించిన శ్రీరామదూత. శ్రీరామ పట్టాభిషేక సమయంలో రాముడు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు.. ఆయన పాదసేవను కోరుకున్న భక్తాగ్రగణ్యుడు. చదువులో, భక్తిలో, కార్యసాధనలో, పాండిత్యంలో, నేర్పులో, జీవన విధానంలో, సేవలో, అన్ని రంగాలలో తనదైన ముద్రవేసి గొప్ప మార్గదర్శకునిగా మన హృదయాలలో ముద్ర వేసుకున్న హనుమంతుడు మనకు నిజమైన స్ఫూర్తి. విద్యలున్నాయని విర్రవీగకుండా భగవంతుని పాదాలను ఆశ్రయించి.. ఎవరిని పట్టుకుంటే జన్మ సార్థకమవుతుందో సమస్త మానవాళికీ మార్గదర్శనం చేసిన హనుమ బాటలో నడవడమే సనాతన ధర్మాన్ని పాటించే అందరికీ తక్షణ కర్తవ్యం
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో