వెంకయ్యనాయుడు… భారత ఉపరాష్ట్రపతి. నిన్న మొన్నటి వరకూ కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్య ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరించేవారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో భాజాపా-టీడీపీ పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఇటు రాష్ట్రంలోను…అటు కేంద్రంలోను మంత్రి వర్గంలో కూడా భాగస్వాములు కూడా ఉన్నారు. పొత్తుల విషయంలో వెంకయ్యనాయుడు కీలక పాత్ర పోషించారు.ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బాబును దూరంగా ఉంచడం మొదలు పెట్టారు. కేంద్రంనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలోకూడా వెంకయ్యనాయుడు ప్రముఖ పాత్ర పోషించారు. చంద్రబాబును మోదీ దూరంగా ఉంచడం ఎన్నో సార్లు స్పష్టంగా కనపడుతున్నా కేంద్రమంత్రిగా వెంకయ్య ఉన్న కారణంగా చంద్రబాబు ఏదోలా నెట్టుకొచ్చే వారు. ఎప్పుడైతే వెంకయ్యను మోడి ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేశారో అప్పటి నుండే చంద్రబాబుకు సమస్యలు మొదలయ్యాయి. వెంకయ్యనాయుడి కారణంగానే ఏదో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. దీంతో వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నంత వరకు బాబు తలనొప్పి తగ్గదని మోదీ… వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపించారు. ఉపరాష్ట్రపతి పదవి వెంకయ్యకు ఇష్టం లేకున్నా మోడికి ఎదురు చెప్పలేక ఉపరాష్ట్రపతిగా వెంకయ్య బాధ్యతలు తీసుకోక తప్పలేదు. అలాంటి వెంకయ్యనాయుడు కొన్నిరోజులుగా ఏపీకి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వెంకయ్యనాయుడు ఏపీకి గత నెల రోజుల నుంచి రాలేదు. ఇటీవలే హైదరాబాద్ కు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు ఏపీకి మాత్రం వెళ్లలేదు.వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ, బీజేపీల మధ్య సంధాన కర్తగా వ్యవహరించేవారు. ఏపీ సమస్యలను కూడా ఆయన దగ్గరుండి పరిష్కరించేవారు. వెంకయ్య కేంద్రమంత్రిగా ఉన్నంతవరకూ చంద్రబాబు హాయిగా నిద్రపోయేవారు. ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంకయ్యనాయుడు ఏపీ విభజన హామీల అమలుకోసం కృషి చేసేవారు. తొలినుంచి వెంకయ్యకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉండటం, బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ఉద్దేశ్యం, ఏపీ సొంత రాష్ట్రం కావడంతో ఆయన ప్రత్యేక దృష్టి పెట్టేవారు.తర్వాత ఆయన ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కూడా విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ వంటి అంశాలపై సంబంధిత మంత్రులు, అధికారులను తన వద్దకే పిలిపించుకుని పురోగతిపై చర్చించే వారు. అయితే ఇప్పుడు టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగడమే కాకుండా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. అంతేకాదు ఇప్పుడు చంద్రబాబు నుంచి గల్లీ స్థాయి టీడీపీ లీడర్ వరకూ ప్రధాని మోడీనే టార్గెట్ గా చేసుకున్నారు. బీజేపీ నుంచి టీడీపీ విడిపోయి దాదాపు పదిహేను రోజులపైనే అయిపోయింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మరీ మోడీకి వ్యతిరేకంగా జాతీయ మీడియా ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. ఈ పరిస్థితుల్లో వెంకయ్యనాయుడు ఆంధ్రపర్యటనకు వస్తే ఆయనకు కొంత ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఇటు చంద్రబాబు…అటు మోడీ. ఎవరనీ నొప్పించలేని పరిస్థితి వెంకయ్యనాయుడిది. అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణ పర్యటనకు వచ్చిన వెంకయ్య అటునుంచి అటే హస్తినకు వెళ్లిపోయారు. వెంకయ్య సహజంగా నెలలో రెండుసార్లయినా ఏపీ పర్యటనకు వచ్చేవారు. కాని నెల నుంచి ఇటు రావడమే మానుకున్నారు. ఏపీ బీజేపీలోనూ తన వర్గం వారికి చెక్ పెడుతుండటం కూడా ఆయనకు మనస్తాపానికి గురిచేసిందంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో వెంకయ్య ఈ నెల 12వ తేదీన అమరావతికి వచ్చే అవకాశముందంటున్నారు. మంగళగిరిలో ఆనంద నగరాల సదస్సు ముగింపురోజున వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా రానున్నారు. అయితే ఈ సదస్సులో వెంకయ్య స్పీచ్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వాత్రా నెలకొంది.