భార్య దగ్గర్నుంచి కోటి రూపాయిల వసూళ్లు
హైద్రాబాద్, జూన్ 19,
అతను ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కానీ బుద్ధి మాత్రం చెడిపోయింది. ఏకంగా కట్టుకున్న భార్యనే ఇబ్బందులకు గురి చేశాడు. అంతేకాకుండా మిత్రుడి పేరుతో తన భార్యతో చాటింగ్ చేస్తూ, అశ్లీల వీడియోలు ఆ పేరుపై పంపేవాడు. అంతేకాక, కట్టుకున్న భార్య దగ్గర నుంచి రూ.కోటి వరకూ వరకు కొట్టేశాడు. ఈ దురాగతం చేస్తుంది భర్త అని తెలియక ఆందోళన చెందిన ఆ బాధితురాలు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు చేరుకుంది. వేధింపులకు గురి చేస్తున్న భర్త ఫ్రెండ్ మీద కేసు పెట్టింది. ఈ కథ మొత్తం నడిపించింది తన భర్త అని తెలిసి చివరకు బాధితురాలు అవాక్కయింది. దీంతో భర్తపై ఫిర్యాదు చేసి అరెస్టు చేయించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలికి కరీంనగర్‌లో ఉంటున్న సంతోష్ కుమార్‌కి పరిచయం ఏర్పడింది. మాట్రిమోనియల్ సైట్ ద్వారా జరిగిన ఈ పరిచయం కాస్తా ఫోన్ కాల్స్, చాటింగ్ చేసి ప్రేమ వరకూ వెళ్లింది. పెద్దల సమక్షంలో కట్న కానుకలతో వివాహం జరిగింది. రూ.10 లక్షలు నగదు, రూ.5 లక్షలు ఆడపడుచు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం జరిగాక ఆమె ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లింది.ఇక్కడే ఉన్న భర్త సంతోష్ కుమార్ తన అవసరాల నిమిత్తం మోసపూరిత మాటలు చెప్పి రూ.63 లక్షలు భార్య నుంచి తీసుకున్నాడు. అదే విధంగా సత్యహర్ష రెడ్డి అనే పేరుతో ప్రమీల మొబైల్, మెయిల్‌కు అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపేవాడు. ఈ విషయంలో ఆమెకు తన భర్త పైన అనుమానం వచ్చి గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా తన భర్త సంతోష్ కుమార్, సత్యహర్ష రెడ్డి అనే పేరుతో ఆమెకు అసభ్యకర సందేశాలు పంపినట్టు తేలింది. దీంతో తన భర్తే మరొక వ్యక్తి పేరుతో అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలు పంపి ఆమెను మానసికంగా వేధించి డబ్బులు లాగాలని బాధితురాలు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సత్యహర్ష పేరుతో భార్యని ఇబ్బందులకు గురి చేసిన సంతోష్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పెళ్లి దగ్గర నుంచి అరెస్ట్ చేసే వరకూ దాదాపు రూ.కోటి తన భర్త తన నుంచి తీసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.