ఏపీలో ప్రత్యేకహోదా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి.ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష కొనసాగుతోంది దీక్షలకు సంఘీభావంగా నిన్న హైవేల్ని దిగ్భందించిన వైసీపీ కార్యకర్తలు బుధవారం రైల్రోకో చేపట్టారు. పలు చోట్ల వైకాపా కార్యకర్తలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. నెల్లూరులో వైసీపీ రైల్రోకో సందర్భంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొన్నిచోట్ల పోలీసులు,వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలను మాత్రమే పోలీసులు రైల్వే స్టేషన్ లోనికి అనుమతించడంతో పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు రైల్వే స్టేషన్ వెలుపల ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు- వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్యా వాగ్వాదం జరిగిన పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంటూరులో రైల్ రోకో సందర్భంగా వైకాపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గుంతకల్లులో కర్ణాటక ఎక్స్ప్రెస్ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతపురం రైల్వే స్టేషన్లో ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తోపాటు ఇతర వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ట్రాక్ పై కూర్చుని "ప్రత్యేక హోదా" నినాదాలు చేసారు.