భారత్, చైనా 1.30 లక్షల కోట్ల వ్యాపారం
న్యూఢిల్లీ, జూన్ 20
దాదాపు 50 సంవత్సరాల తర్వాత చైనా మళ్లీ దొంగదెబ్బతీసి 20 మంది భారత సైనికులను హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు తిరగబడుతున్నారు. దీనికి ప్రతీకారంగా చైనా ఉత్పత్తులు వేటినీ దేశ ప్రజలు కొనకూడదంటూ లక్షల సంఖ్యలో డిమాండ్లు వెల్లుతుతున్నాయి. గల్వాన్ లోయలో జరిగిన ఆ దారుణ ఘటనపై జాతి మొత్తం ఏకతాటిపై నిలబడి చైనా వస్తువులను వాడకూడదంటూ సామూహిక శపథాలు చేస్తోంది.. ఇక సోషల్ మీడియా అయితే చైనా వ్యతిరేక పోస్టులతో వెర్రెత్తిపోతోంది.ఈ పరిణామంతో అంత పెద్ద చైనా కూడా ఉలిక్కిపడటం మొదలెట్టింది. నిజంగా భారత్ చైనా వస్తువుల బహిష్కరణను కట్టుదిట్టంగా అమలు జరిపితే చైనాకు 1.29 లక్షల కోట్ల వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి వుంది. చైనా నుంచి భారత్ ఏటా రూ.5.65 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఈ మొత్తం దిగుమతుల్లో చిల్లర వ్యాపారులు రూ.1.29 లక్షల కోట్ల విలువైన వస్తువులను విక్రయిస్తారు. వీటిలో ప్రధానంగా బొమ్మలు, ఆటవస్తువులు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. గల్వాన్ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం చైనా ఉత్పత్తుల స్థానంలో భారతీయ వస్తువులను విక్రయించాలని జాతీయ వ్యాపార సంస్థ నిర్ణయించిందిగల్వాన్ లోయలో భారతీయ సైనికుల పట్ల చైనా జవాన్లు పాల్పడిన దుశ్చర్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు గళమెత్తుతున్నారు. 20 మంది సైనికులను హత్య చేసినందుకు ప్రతీకారంగా చైనా ఉత్పత్తులను వాడకూడదన్న డిమాండ్లు రోజురోజుకూ వెల్లువెత్తుతున్నాయి. ఇదే కనుక జరిగితే చైనా రూ.1.29 లక్షల కోట్ల వ్యాపారాన్ని కోల్పోయే అవకాశం ఉంది.చైనా నుంచి వస్తువుల దిగుమతిని నిలిపివేయాలని తాజాగా ‘అఖిల భారత వ్యాపార్ మండలి సమాఖ్య’ (ఎఫ్‌ఏఐవీఎం) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇకపై డ్రాగన్ వస్తువుల కొనుగోలుకు ఆర్డర్లు ఇవ్వకూడదని మండలి ప్రధాన కార్యదర్శి వీకే బన్సాల్ వ్యాపారులకు సూచించారు. చైనా వస్తువులను విక్రయించరాదని వ్యాపారులకు తెలియజేశామని పశ్చిమ బెంగాల్ వ్యాపారుల సంఘ సమాఖ్య అధ్యక్షుడు సుశీల్ తెలిపారు. రైల్వేలో ఇక మేడిన్ ఇండియా పరికరాలే వాడతామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. తాము తయారుచేసిన ఉత్పత్తులను ఎగుమతి అయ్యేలా ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు. రైల్వే టెండర్లలో పాల్గొనడానికి దేశీయ బిడ్డర్లకే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. కాగా, చైనాపై ఆధారపడకూడదని, దేశీయంగా వస్తువులను ఉత్పత్తి చేయడానికి పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి గడ్కరీ పిలుపునిచ్చారు.దీనిపై ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. భారతీయ ఎలక్ట్రిక్ వాహనంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ‘చైనా వస్తువుల ధరలు చవకగా ఉన్నందువల్ల భారతీయ ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు చైనా నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని లాభాలు ఆర్జిస్తున్నాయి. ఇది దీర్ఘకాలంలో చైనాకు మేలు చేస్తుంది. కాబట్టి ఇక నుంచి ప్రతి వస్తువునూ స్థానికంగానే తయారు చేయాలి’ అని గడ్కరీ చెప్పారు.భారత్‌లో చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్లు, పిలుపులు ఊపందుకుంటున్న దృష్ట్యా చైనా అప్రమత్తమైంది. భారత్‌తో సంబంధాలను చైనా గౌరవిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ చెప్పారు. ప్రస్తుతం చైనా వస్తువులను బహిష్కరించాలని భారత్‌లో జరుగుతున్న ప్రచారంతో డ్రాగన్‌కు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఆ దేశ కంపెనీలైన షామీ, ఒప్పో, హువే తదితరాలకు భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. చైనా వ్యతిరేక సెంటిమెంట్ ఆ కంపెనీలకు మింగుడు పడడంలేదు.