సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ.. గాల్వన్ వద్ద భారత్ పట్టునిలుపుకునే ప్రయత్నం
ఢిల్లీ జూన్ 21. .తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద ప్రస్తుత క్షేతస్థాయి పరిస్థితులపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ, భారత భూభాగంగా పరిగణిస్తోన్న పాంగాంగ్ సరస్సు వెంబడి 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో మే ప్రారంభం నుంచి చైనా సైన్యం డజన్ల కొద్దీ కొత్త స్థావరాలు, బంకర్లను నిర్మించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలోని పలు ప్రాంతాలను చైనా దళాలు నియంత్రణలోకి తీసుకున్నాయి. పెట్రోలింగ్ పాయింట్స్ 14 వద్ద ఘర్షణలపై ద్వైపాక్షిక సైనిక చర్చలు జరుగుతున్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటోంది. గాల్వన్ లోయ పెట్రోలింగ్ పాయింట్ 14 సమీపంలో ఉన్న ప్రాంతంపై భారత సైన్యం ఇప్పుడు పట్టు సాధించిందని అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. ఇక్కడే వాగ్వాదం మొదలై ఘర్షణకు దారితీసి రక్తపాతం చోటుచేసుకుంది. జూన్ 15న 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోగా, 76 మంది గాయపడ్డారని ఆర్మీ వెల్లడించింది. ఘర్షణ జరిగిన గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనిక నిర్మాణాలు ఉండటంతో అంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గవని అధికార వర్గాలు తెలిపాయి.