పోతనను కాపాడిన యజ్ఞ వరాహమూర్తి*
హిరణ్యాక్షుని సంహరించిన పరమోత్కృష్టమైన అవతారం.. యజ్ఞస్వరూపమైన యజ్ఞవరాహావతారం. యజ్ఞసాధనాలతో అమరికతో కూడుకున్న యజ్ఞ వరాహమూర్తి స్మరణ మంగళాలకు, రక్షణకు దారితీస్తుంది. ఆ మూర్తిని స్మరించుకుని నమస్కరిస్తే చాలు! దీన్ని నిరూపించే ఒక అద్భుతమైన ఘట్టం పోతనామాత్యుడి జీవితంలో జరిగింది.ఒకసారి ఆయన పర్ణశాలలో కూర్చుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తుంటే కర్ణాటకకు చెందిన ప్రభువొకడు.... ‘పోతనగారు నాకు భాగవతం అంకితమివ్వనని అంటున్నారు. వెళ్లి బంధించి తీసుకుని రండి’ అంటూ తన సైన్యాన్ని పంపించాడు.వారు వెళ్లేసరికి పర్ణశాలముందు ఒక పెద్ద శ్వేతవరాహం.. తెల్లటి పంది పడుకుని ఉన్నది. కోరలు చూపి ఒక అరుపు అరవగానే వారు భయపడి వెనుకకు వెళ్లిపోయారు.సైన్యాధిపతి కూడా వచ్చి ఆ వరాహాన్ని చూసి భయపడి వెళ్లిపోయాడు. మహారాజు స్వయంగా వచ్చి ఆ శ్వేత వరాహాన్ని చూసి హడలిపోయి, చేష్టలుడిగిపోయి ఉండిపోయాడు. అయితే.. ‘‘భాగవతం నాకే అంకితమివ్వాలని లోపల ఉన్న పోతన గారిని నిగ్రహించను. ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుని వెళ్లిపోతాను’’ అని ఆ రాజు అనుకోగానే పడుకున్న వరాహం కాస్తా పైకి లేచి వొళ్లు విదల్చుకుని నడుచుకుంటూ వెళ్లిపోయింది.వెంటనే రాజు తన పరివారంతో వెళ్లి ఆయనకి నమస్కరించి ‘‘మీ పర్ణశాలలోకి వద్దామని అనుకుంటే ఒక పెద్ద వరాహం అడ్డుగా పడుకుని అరుస్తున్నది.ఆ అరుపు మీకు వినపడలేదా? ఎలా ఆంధ్రీకరిస్తున్నారు?’’ అని అడిగారు. పోతనగారు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ‘‘నేను యజ్ఞ వరాహమూర్తి ఆవిర్భావఘట్టం ఆంధ్రీకరిస్తున్నాను. బహుశా మీరు బలవంతంగా భాగవతాన్ని అంకితం పుచ్చుకోవాలని అనుకుని వచ్చారు. అందుకే ఆ యజ్ఞవరాహమూర్తి నా పర్ణశాల బయట పడుకుని నన్ను రక్షించాడు’’ అన్నారు.అంత అద్భుతమైన అవతారమూర్తి స్వామిని స్మరిస్తే చాలు అన్నీ శుభాలే కలుగుతాయి.