YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వంతెన తంటా తీరేనా?

వంతెన తంటా తీరేనా?

అనంతపురంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఈ సంస్థ ఏర్పాటుతో స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది సర్కార్ లక్ష్యం. అంతేకాక కియాకు అనుబంధంగా ఏర్పడే వివిధ సంస్థల ద్వారానూ ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని అంచనా. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిశ్రమ ఏర్పాటుపై ఆసక్తి నెలకొంది. పెనుకొండ సమీపంలో సాగుతున్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణ కార్యక్రమాన్ని చాలామంది ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలాఉంటే కియా పరిశ్రమకు సంబంధించి ఎలాంటి సమస్యల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే స్థానికంగా వంతెన రహదారి మళ్లించేలా కొందరు యత్నిస్తున్నట్లు ఇటీవలిగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పరిశ్రమలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా జాతీయ రహదారితోపాటు, రైల్వే లైన్‌ మీదగా వంతెన, ఇంటర్‌ఛేంజ్‌ కూడలిని నిర్మించేందుకు ఏపీఐఐసీ ప్రతిపాదన రూపొందించింది. 

 

ఏపీఐఐసీ ప్రతిపాదన ప్రకారం వంతెనకు అనుబంధంగా కియా పరిశ్రమవైపు వెళ్లే మార్గం ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కొన్ని ప్రైవేటు భూముల్లో నుంచి వెళ్తోంది. ఈ భూముల్లో కొంతమేర ఓ కీలక నేత బంధువులదని దీంతో వంతెన మార్గాన్ని మార్చేందుకు యత్నాలు సాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. వీరి భూముల్లోని ఏడెనిమిది ఎకరాలు ఈ రహదారిలో పోతున్నాయని టాక్. దీంతో తమ భూములు పోకుండా చూసేందుకు, ఏకంగా రహదారి అలైన్‌మెంట్‌ను పక్కకు జరపాలంటూ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం అలైన్‌మెంట్‌ మార్చేందుకు ససేమిరా అంటున్నారని కొందరు చెప్తున్నారు. ఉన్నతస్థాయిలోనూ సాగించిన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు. కియా విషయంలో అలైన్‌మెంట్లు మార్చే ప్రసక్తే లేదని ఉన్నతాధికారులు తేల్చి చెప్పినట్లు వినికిడి. దీనిపై స్పష్టత వచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం భూసేకరణ విషయమై కొంత వెనకాడుతున్నారని అంటున్నారు. ఏదేమైనా అనంతపురంను పారిశ్రామిక విభాగంగా ముందంజలో తీసుకువచ్చే కియా ప్రాజెక్టు విషయమై ఈ తరహా చర్యలు సాగడంపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆశ్రిత పక్షపాతం వీడి పరిశ్రమ నిర్మాణం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts