ధర్భల మహిమ*
*గ్రహణ కాలంలో దర్భలు ఎందుకు వాడాలి
తులసి, ధర్భలు, బిల్వదళములు వున్న స్ధలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
ఒక విధమైన గడ్డి జాతికి చెందిన ధర్భ మొక్కలు
శ్రీ రాముని స్పర్శ చేత పునీతమై , ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది.
ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు గుణం కలది.
*గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో ధర్భలు వేసి వుంచడం గమనించవచ్చును.*
ధర్భలని సంస్కృతం లో 'అగ్ని గర్భం' అంటారు.
కుంభాభిషేకాలలోను యాగశాలలో ని కలశాలలోను ,బంగారు, వెండి తీగలతో పాటుగా
ధర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు.
ధర్భలలో కూడా స్త్రీ , పురుష , నపుంసక జాతి ధర్భలని మూడు రకాలు వున్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుండి చివరికొసదాకా సమానంగా వుంటాయి. పై భాగంలో దళసరిగా వుంటే అది స్త్రీ ధర్భ గా గుర్తిస్తారు. అడుగున దళసరిగా వున్న ధర్భను నపుంసక ధర్భ గా తెలుసుకోవచ్చును.
ధర్భల దిగువ భాగంలో బ్రహ్మకు , మధ్యస్థానంలో మహావిష్ణువుకు , శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు.
దేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలు ధర్భ కొసలతోను, మానవులను తలచి యిచ్చే తర్పణాలలో ధర్భల మధ్యభాగం నుండి, పితృదేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలలో ధర్భను మడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా వుంది.
వైదికకార్యాలలో , "పవిత్రం" అనే పేరుతో
ధర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు .ఈ వ్రేలిలో కఫనాడి వుండడం వలన యీ ఉంగర ధారణవలన కఫం శుభ్రం చేయబడుతోంది.
ప్రేత కార్యాలలో ఒక ధర్భతోను, శుభ కార్యాలలో రెండు ధర్భలతోను, పితృ కార్యాలలో మూడు ధర్భలతోను , దేవ కార్యాలలో నాలుగు ధర్భలతోను, ఆ ధర్భ ఉంగరాన్ని ముడి వేస్తారు.
దేవతారాధన, జపం, హోమం, దానం తర్పణం వంటి కార్యాలలో ధర్భతో చేసిన 'పవిత్రం'అనే యీ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి.
ధర్భగడ్డిలో పులుపు, క్షార గుణాలు వుండడం వలన రాగి విగ్రహాలను , బూడిద ధర్భలు ఉపయోగించి శుభ్రపర్చాలని శిల్ప శాస్త్రం చెప్తోంది. ఇందు వలన శిల్పాలలోని ఆవాహన మంత్ర శక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా వుంటాయని శాస్త్రజ్ఞులు చెపుతారు.
ఆదివారమునాడు కోసిన ధర్భలను ఒక వారముపాటు ఉపయోగించవచ్చును. అమావాస్యనాడు కోసి తీసుకుని వస్తే
ఒక మాసం వరకు ఉపయోగించవచ్చును.
పౌర్ణమినాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించ వచ్చును.
శ్రావణమాసం లో కోసిన ధర్భలైతే తీసుకుని వస్తే ఒక ఏడాది ఉపయోగించ వచ్చును. భాద్రపద మాసంలో తీసుకుని వస్తే ఆరు మాసాలు ఉపయోగించ వచ్చును. శ్రాధ్ధ కార్యాలకోసం తెచ్చిన ధర్భలను ఏ రోజు కా రోజే ఉపయోగించాలి. తిరునల్లారు శైవక్షేత్రంలో ధర్భలే స్ధల వృక్షం. ఈ క్షేత్రంలో నెలవైయున్న ఈశ్వరుని పేరు ధర్భారణ్యేశ్వరుడు.
సుఖీభవ !