YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

అంతంతమాత్రంగానే అడ్మిషన్లు

అంతంతమాత్రంగానే అడ్మిషన్లు

అంతంతమాత్రంగానే అడ్మిషన్లు
హైద్రాబాద్, జూన్ 22
ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్… ఇలా ఏ సెట్ అయినా ప్రవేశాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటున్నాయి. కొన్నేళ్లుగా ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎఎంఎస్, బిహెచ్‌ఎంఎస్ వంటి మెడిసిన్ యుజి కోర్సులతో పాటు బి.ఎస్‌సి కోర్సులు మినహా దాదాపు అన్ని కోర్సుల్లో సీట్లు మిగిలిపోతుండగా, ఈ సారి కరోనా నేపథ్యంలో మరిన్ని సీట్లు మిగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి హాస్టళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్న కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకే ఆసక్తి కనబరిచే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది వరకు ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులతో పాటు సాధారణ డిగ్రీలో కూడా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి.2019-20 విద్యాసంవత్సరం ఇంజనీరింగ్‌లో 22.07 శాతం సీట్లు ఖాళీగా మిగిలాయి. ఎంసెట్(ఎంపిసి స్ట్రీమ్)లో 1,02,615 మంది విద్యార్థులు అర్హత సాధించగా, 62,901 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు. కన్వీనర్ కోటా కింద మొత్తం 65,648 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, కౌన్సెలింగ్ తర్వాత 14,491 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో జీరో అడ్మిషన్స్ నమోదయ్యాయి. అలాగే ఏడు కళాశాలల్లో సింగిల్ డిజిట్‌లో ప్రవేశాలు నమోదు కాగా, 24 కళాశాలల్లో 50 లోపు ప్రవేశాలు, 43 కళాశాలల్లో 100 లోపు ప్రవేశాలు నమోదయ్యాయి. ఈ సారి 60 కళాశాలల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో 12 యూనివర్సిటీ కళాశాలలు, 48 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఈ సారి మొత్తం 7,793 ఫార్మా సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి విడత ఫార్మా కౌన్సెలింగ్‌లో 94.7 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. బి.ఫార్మసీలో 6,679 సీట్లు అందుబాటులో ఉండగా, 6,106 సీట్లు భర్తీ అయ్యాయి. 417 సీట్లు ఖాళీగా మిగిలాయి.అలాగే ఫార్మా డిలో 1,093 సీట్లు అందుబాటులో ఉండగా మొత్తం సీట్లు భర్తీ అయ్యాయి. బయో టెక్నాలజిలో 21 సీట్లు అందుబాటులో ఉండగా వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసెట్(బైపిసి)లో మొత్తం 61,159 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 10,919 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అందులో 9,815 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మొదటి విడత ఫార్మా సీట్ల కేటాయింపు తర్వాత 417 బి.ఫార్మసీ సీట్లు ఖాళీగా మిగిలాయి. రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సులు నిర్వహించే కాలేజీలు 319 ఉన్నాయి. వీటిలో 278 ఎంబిఎ కాలేజీల్లో 21,281 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా, 21,035 సీట్లు మాత్రమే నిండాయి. అలాగే 41 ఎంసిఎ కళాశాలల్లో 2,077 సీట్లు అందుబాటులో ఉండగా, 1995 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ సారి అన్ని కోర్సుల్లో సీట్లు గత ఏడాది కంటే అధికంగా మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాష్ట్రంలోని 984 డిగ్రీ కళాశాలల్లో 3,86,684 సీట్లు అందుబాటులో ఉండగా, 1.90 వేల సీట్లు భర్తీ భర్తీ అయ్యాయి. సుమారు 2 లక్షల సీట్లు ఖాళీగా మిగిలాయి. డిగ్రీ సీట్ల భర్తీకి డిగీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) ద్వారా ఐదు విడతల్లో ప్రవేశాలు నిర్వహించినా, 50 శాతానికిపైగా సీట్లు ఖాళీగా మిగిలాయి. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో 50 శాతం కూడా భర్తీ కాలేదు. భర్తీ అయిన సీట్ల కంటే మిగిలిన సీట్లే అధికంగా ఉంటున్నాయి. డిగ్రీలో గత కొన్నేళ్లుగా సగానికిపైగా సీట్లు మిగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్ కళాశాలల్లో వివిధ కాంబినేషన్లలో ఈ సారి 727 కోర్సులలో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. దాంతో ఆయా కళాశాలల్లో జీరో అడ్మిషన్లు నమోదైన కోర్సులు భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts