సీనియర్ నేత ఎస్‌ఎం. కృష్ణ మళ్లీ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఏడాది క్రితం ఆయన అనూహ్యంగా బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీ మీద పెట్టుకున్న ఆశలు, భ్రమలు తొలగిపోవడంతో తిరిగి సొంత పార్టీలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి ఊహించని షాక్ తగిలినట్లయింది.ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎలాగైనా గెలిచి దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ఇందుకోసం ఎన్నికల ప్రచారంలో ఒకదానిపై ఒకటి ఆధపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అగ్రనేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం హోరెత్తుతోంది. అయితే సిద్ధరామరాయ్యను ఇరకాటంలో పెట్టేందు్కు ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ తిరిగి సొంత పార్టీ గూటికే చేరబోతున్నారు. ఏడాది క్రితం ఆయన అనూహ్యంగా బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీ మీద పెట్టుకున్న ఆశలు, భ్రమలు తొలగిపోవడంతో ఆయన తిరిగి సొంత పార్టీలోకి వస్తున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బీజేపీ కావాలనే తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా దూరంగా ఉంచినట్టు ఎస్.ఎం.కృష్ణ భావిస్తున్నారనీ, రెండు నెలలుగా బీజేపీని వీడుతున్నాననే సంకేతాలు కూడా ఆయన ఇస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలతో బీజేపీ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని రాజరాజేశ్వరినగర అసెంబ్లీ సీటును ఎస్ఎం కృష్ణ కుమార్తె శాంభవికి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. రాష్ట్ర బీజేపీ కానీ, కేంద్ర నాయకత్వం కానీ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వడం లేదు. వాస్తవానికి ఆయన బీజేపీలో లేనట్టే. ఆయన మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పారు. ఎస్.ఎం.కృష్ణను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర, విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ సంసిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇదిలాఉంటే.. ఎస్‌ఎం. కృష్ణ పార్టీలోకి వస్తున్నారన్న విషయంపై ఆపార్టీ నేతలు ఇప్పటికే అధినేత రాహుల్‌గాంధీతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ కూడా సీఎం సిద్ధరామయ్య అంగీకరిస్తే ఒక్కలిగ సామాజిక వర్గ నేత అయిన ఎస్.ఎం.కృష్ణ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారంపై ఎస్ఎం కృష్ణ, అటు బీజేపీ నాయకత్వం గానీ స్పందించలేదు. ఏదేమైనా కృష్ణ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న పరిణామాలు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకు నాంది అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.