డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల
జూలై 1 నుంచి 14 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం
హైదరాబాద్ జూన్ 22
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూలై 1 నుంచి 14 వరకు మొదటి విడద దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని దోస్త్ కన్వీనర్ లింబాద్రి ప్రకటించారు. జూలై 6 నుంచి 15 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జూలై 22న మొదటి విడత సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు. జూలై 23 నుంచి 27 వరకు విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.జూలై 23 నుంచి 29 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆగస్టు 8 నుంచి 14వ తేదీ వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలన్నారు. ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. సాధారణంగా ప్రతి ఏడాది ఇంటర్ ఫలితాలు వెలువడిన రోజే దోస్త్ ప్రకటన విడుదల చేస్తారు. అయితే కరోనా మహమ్మారి వల్ల ఈసారి ఆలస్యమయ్యింది. రాష్ట్రంలోని సుమారు వెయ్యికిపైగా డిగ్రీ కాలేజీల్లో 200 కోర్సుల్లో సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు.