YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎండలు బాబోయ్!

 ఎండలు బాబోయ్!

జగిత్యాల, ఏప్రిల్ 11 (న్యూస్‌పల్స్)

తెలంగాణలో భానుడి ప్రతాపం తీవ్రమవుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు మండిపోతుండడంతో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితి. అత్యవసర పనులుంటే మినహా మధ్యాహ్నం రోడ్లపైకి ఎవరూ రావడంలేదు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయమే కాక సాయంత్రం సైతం వేడిమి తగ్గడంలేదు. జగిత్యాల ప్రాంతంలో సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఉష్ణోగ్రత 37డిగ్రీల సెల్సియస్ లకు పైగానే నమోదు అయింది. అంటే టెంపరేచర్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఈజీగానే అర్ధం చేసుకోవచ్చు. జగిత్యాలలోనే కాక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 35డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాలతో వేడి తగ్గినట్లు అనిపించినా గంటల వ్యవధిలోనే వేడిమి పుంజుకుంటోంది. దీంతో జనాలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. 

 

మార్చ్ నుంచే ఎండలు తీవ్రమయ్యాయి. ఇక ఏప్రిల్‌లోనూ అంతకు మించిన ఎఫెక్ట్ ఉంటోంది. మే నెల వచ్చే నాటికి ఉష్ణోగ్రత మరింతగా పెరిగే అవకాశమే ఉంది. దీంతో ప్రజల్లో భయాందోళనలు వెల్లువెత్తతున్నాయి. ఉష్ణతాపం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంతా భయపడుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో నాలుగు జిల్లాల పరిధిలోని కనిపించిన గరిష్ఠ ఉష్ణోగ్రతల స్థాయిని మించేలా ఈ వేసవిలో ఎండలు మండనున్నాయని భావిస్తున్నారు. నాలుగు జిల్లాల పరిధిలో గడిచిన నాలుగేళ్లలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఎక్కువ ఊష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బను జయించాలంటే వైద్యఆరోగ్యశాఖ నుంచి తగిన సలహాలు సూచనలు అందాల్సిన అవసరముందని అంతా అంటున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు యంత్రాంగం రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. ఉష్ణోగ్రతలను తప్పించుకునేందుకు విస్తృత ప్రచారం చేపట్టడంతో పాటూ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు విరివిరిగా అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు.

Related Posts