లఢక్ సరిహద్దులో భారత్ ప్రత్యేక పర్వత దళాలు
న్యూఢిల్లీ జూన్ 23
లఢక్ సరిహద్దులో చైనాతో ఘర్షణ నేపథ్యంలో ప్రత్యేక పర్వత దళాలను భారత్ రంగంలోకి దించింది. పశ్చిమ, మధ్య, తూర్పు చైనా సరిహద్దుల్లోని 3,488 కిలోమీటర్ల మేర విస్తరించిన నియంత్రణ రేఖ వెంబడి ఈ ప్రత్యేక దళాలను ఆర్మీ మోహరించింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా దీటుగా జవాబు చెప్పాలని ఆదేశించింది. హిమాలయ పర్వతాల్లోని ఎత్తైన శిఖరాలు ఆవరించిన ఈ సరిహద్దు ప్రాంతాలను కాపాడుకోవడం, ఇక్కడ గస్తీ నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో ఈ సరిహద్దుల్లోని క్లిష్టమైన కొండ ప్రాంతల్లో పోరాడేందుకు గత పదేండ్లుగా ఓ ప్రత్యేక పర్వత దళానికి భారత ఆర్మీ శిక్షణ ఇస్తున్నది.ఉత్తరాఖండ్, లఢక్, గూర్ఖా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింకు చెందిన పర్వతారోహకుల నిఫుణులతో కూడిన బృందాలకు సైనిక శిక్షణ ఇస్తున్నారు. కొండలు, లోయల్లో శత్రువులను లక్ష్యంగా చేసుకుని ఆయుధాలు, రాకెట్లు ప్రయోగించడంలో వీరు ట్రైనింగ్ పొందుతారు. గొరిల్లా యుద్ధ విద్యలోనూ ఆరితేరుతారు. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయానికి ఈ ప్రత్యేక పర్వత దళాలు ఎంతో శ్రమించాయి. ఉత్తరంలోని సైనిక శిబిరాల్లో ఉండే ఈ దళాన్ని తాజాగా ఎర్ర జెండాలను ఎగురేసిన చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారత్ మోహరించింది. దీంతో చైనా నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా దీటుగా తిప్పికొట్టగలమన్న సంకేతాన్ని ఇచ్చినట్లయ్యింది.