కాల్వలో కారు... వీడిన సూసైడ్ మిస్టరీ
కరీంనగర్, జూన్ 23,
రోడ్డు ప్రమాదం కారణంగా కాల్వలో పడి గల్లంతైన ఓ మహిళ కోసం గాలిస్తుండగా బయటపడిన కారు.. ఆ కారులో ముగ్గురి మృతదేహాలు. వారంతా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబసభ్యులు. అదృశ్యమైన 20 రోజుల తర్వాత కాకతీయ కాలువలో విగతజీవులుగా తేలిన ఘటన. కరీంనగర్‌లో జనవరి 27న చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ మరణాలపై పలు అనుమానాలు రేకెత్తాయి. రోడ్డు ప్రమాదమా? ఆత్మహత్యా? ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేసి చివరికి మిస్టరీని చేధించారు. ఆత్మహత్యగా తేల్చారు.ఈ ఘటనకు సంబంధించి కరీంనగర్ పోలీసులు కీలకమైన ఆధారాలను బయటపెట్టారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధిక (50), బావ సత్యనారాయణ రెడ్డి (55), కూతురు వినయశ్రీ (21) ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి ఒక సూసైడ్ లేఖ దొరికినట్టుగా పోలీసులు చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ లేఖను వారే రాసినట్టుగా ఫోరెన్సిక్ నిపుణులు తేల్చినట్లు తెలిపారు. సత్యనారాయణ రెడ్డికి చెందిన ఫెర్టిలైజర్ షాపులో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యగా నిర్ధారణ చేసినట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు.జనవరి 27న కరీంనగర్‌లోని బ్యాంక్ కాలనీలోని తన ఇంటి నుంచి సత్యనారాయణ రెడ్డి తన భార్య రాధ, కుమార్తె వినయశ్రీతో కలిసి కారులో బయలుదేరారు. అదే రోజు వారి కారు అల్గునూరు వద్ద కాకతీయ కాలువలో పడిపోయింది. నాటి నుంచి వారి ఆచూకీ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఇరవై రోజులకు కరీంనగర్ నుంచి గన్నేరువరానికి బైక్‌పై బయలుదేరిన ఇద్దరు దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో మహిళ గల్లంతైంది.నీటిలో కొట్టుకుపోయిన మహిళ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాలువలోకి నీటి విడుదలను నిలిపివేశారు. ఈ క్రమంలో కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో అనూహ్యంగా సత్యనారాయణ రెడ్డి కారు బయటపడింది. మృతులందరూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులుగా గుర్తించిన పోలీసులు ఆయనకు సమాచారం ఇచ్చారు.వినయశ్రీ కాలేజీ మిత్రురాళ్లు ఆమె టూర్ వెళ్లి ఉంటుందని భావించారు. ఒక్కసారిగా ఆమె మరణవార్త తెలియడంతో షాక్‌కు గురయ్యారు. ఏడేళ్ల కిందట వినయశ్రీ సోదరుడు శ్రీనివాస్ రెడ్డి సిరిసిల్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనతో కుటుంబం బాగా కుంగిపోయింది. ఈ నేపథ్యంలోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.