YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

శిక్షణ అంటారు.. సొమ్ము చేసుకుంటారు..

శిక్షణ అంటారు.. సొమ్ము చేసుకుంటారు..

నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో శాఖా పరంగా వివిధ శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటారు. అయితే ఈ శిక్షణల పేరుతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యాధికారులు, కిందిస్థాయి సిబ్బందికి శిక్షణ సమయాల్లో ఇవ్వాల్సిన అలవెన్సులు కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడంలేదని పలువురు లబ్ధిదారులు వ్యాఖ్యానిస్తున్నారు. శిక్షణ ఇవ్వడానికి స్థానిక కార్యాలయంతోపాటు మహిళా ప్రాంగణంలో అనువైన వసతులున్నా ప్రైవేటు సంస్థలో శిక్షణలు నిర్వహిస్తూ కమీషన్లకు పాల్పడుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ సొమ్మే కదా ఎంతో కొంత జేబు చేసుకుంటే అడిగేవారు ఉండరన్న భావనతో పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. వైద్యాధికారులు, ఆశావర్కర్లకు తరచూ సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. అయితే లెక్క ప్రకారం వీరికి రవాణా, భోజన చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ సొమ్ము వారి చేతికివ్వడంలేదు. ఇచ్చినా కొద్ది మొత్తమే అందిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం అందించే చార్జీలు రూ.350 నుంచి రూ.150 వరకూ ఉంటుంది. ఈ మొత్తానికి రాద్ధాంతం చేస్తే బాగోదని కొందరు మిన్నకుండిపోతున్నారు. దీంతో సొమ్ము జేబు చేసుకుంటున్న వారి తీరు మారడంలేదు. అందినకాడికి దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. 2017లో దాదాపు 767 శిక్షణలు నిర్వహించినట్లు సమాచారం. ఈ క్లాసులకు రూ.22.69 లక్షలు ఖర్చు చేశారు. ఈ నిధుల్ల్లో రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఆఫీసులోనే ఏడాదిలో ఒక్క శిక్షణ కూడా కొత్తగా ఏర్పాటు చేసిన హాల్‌లో జరగలేదని సమాచారం. మరోవైపు నామమాత్రపు ధరలతో మహిళా ప్రాంగణంలో నిర్వహించే ట్రైనింగ్‌కు స్వస్థి పలికారని, ఎలాంటి అనుమతి లేకుండా జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు నిలయంలో శిక్షణలు నిర్వహిస్తున్నారని వినికిడి. సదరు ప్రైవేట్‌ సంస్థకు చెందిన నిర్వాహకులతో ఒకరిద్దరు అధికారులు కమీషన్లకు ఆశపడి ఏటా రూ.లక్షలు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత విభాగంలోని ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమాలకు తెరదించాలని అంతా కోరుతున్నారు.

Related Posts