సుమారు 5,25, 000 మందిపై పడనున్న వీసాల రద్దు ప్రభావం
న్యూ ఢిల్లీ జూన్ 23
విదేశీ వర్కర్లకు ఇచ్చే వీసాలను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై ప్రకటన చేశారు. అయితే వీసాల రద్దు ప్రభావం సుమారు 5,25000 మందిపై పడనున్నది. వీసాలు కోల్పోతున్నవారిలో ఎక్కువ శాతం హై స్కిల్డ్ టెక్నికల్ వర్కర్లు, నాన్ అగ్రికల్చరల్ సీజనల్ హెల్పర్లు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. ఈ ఏడాది మొత్తం కొత్త వీసాల జారీ ఉండదని ట్రంప్ తెలిపారు. కొత్తగా గ్రీన్‌కార్డులు జారీ చేయాలనుకున్న లక్షా 70 వేల మందిపైన కూడా ప్రభావం చూపనున్నది. గ్రీన్‌కార్డు ఉన్న విదేశీయులు పర్మనెంట్ రెసిడెంట్స్ అవుతారు. ఆ వెయిటింగ్ లిస్టులో ఉన్న 170000 మందికి ఇదో షాక్ వార్తే. ఏప్రిల్ నెలలో జారీ చేసిన ఆదేశాలను ఈ ఏడాది చివర వరకు పొడగించనున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. కొత్త ఆదేశాల ప్రభావం ప్రస్తుతం వీసా ఉన్నవారిపై పడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇమ్మిగ్రేషన్ గ్రీన్‌కార్డులను సస్పెండ్ చేయడం వల్ల భారతీయ హెచ్1బీ టెకీ వీసాదారులపై ప్రభావం పడుతుంది. సిలికాన్ వ్యాలీ కంపెనీలు తక్కువ జీతం తీసుకునే ఉద్యోగులకు హెచ్1బీ వీసాలు జారీ చేశాయని విమర్శకులు అంటున్నారు. గత ఏడాది సుమారు 225000 మంది హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 85 వేల స్పాట్స్ అందుబాటులో ఉండగా.. 2.25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.ఇక సీజనల్ వర్కర్లకు ఇచ్చే హెచ్-2బీ వీసాలను దాదాపు పూర్తిగా రద్దు చేశారు. స్వల్ప వ్యవధి కోసం ఇచ్చే జే-1 వీసాలను కూడా హోల్డ్‌లో పెట్టేశారు. ఈ వీసాల వల్ల విదేశీ విద్యార్థులపై ప్రభావం పడుతుంది. ప్రొఫెసర్లు, స్కాలర్స్‌కు మాత్రం దీని నుంచి మినహాయింపు కల్పించారు. బహుళజాతి కంపెనీల్లో మేనేజర్లకు ఇచ్చే ఎల్ వీసాలను కూడా రద్దు చేశారు. గ్రీన్‌కార్డులు హోల్డ్ లో పెట్టడం, విదేశీ వర్కర్లకు వీసాలు రద్దు చేయడం వంటి తాజా ఆదేశాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని వ్యాపార వర్గాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా సివిల్ లిబర్టీ యూనియన్‌ను కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. మహమ్మారి కమ్ముకున్న వేళ.. ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మార్చేస్తున్నారని ఆ సంఘం ఆరోపించింది.