జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కల్యాణ్ కొండగుట్ట పర్యర్తనను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకున్న తర్వాతే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. కొండగట్టులో మొక్కు తీర్చుకునేందుకు పవన్ వస్తే తమకు అభ్యంతరం లేదు కానీ, రాజకీయ మనుగడ కోసం వస్తే ఊరుకోమని హెచ్చరించారు. మేడారం జాతర సందర్భంగా కొండగట్టు రద్దీ పెరిగిన నేపథ్యంలో పవన్ పర్యటనకి ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్- పవన్ మధ్య కుదుర్చుకున్న చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటుని చీల్చడానికే పవన్ కొండగట్టు వస్తున్నాడని విమర్శించారు. తెలంగాణాని వ్యతిరేకించిన పవన్ వస్తే రెడ్ కార్పేట్ పరుస్తారా అంటూ పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొ. కోదండరాం పర్యటనకు పర్మిషన్ ఇవ్వరు, కానీ, పవన్ పర్యటన చేస్తానంటే ఎలా పర్మిషన్ ఇస్తారని పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు.