విత్తనాల ఎంపికలో రైతులు తరచూ మోసపోతున్నారు. నాసిరకం విత్తనాలు వినియోగిస్తుండడంతో నష్టాల పాలవుతున్నారు. పలువురు దళారులు, ఎరువుల దుకాణాల వారు సూచించే విత్తనాలను సాగుకు వినియోగిస్తున్నవారూ ఉన్నారు. ఇలాంటివారి సలహాలు విని, వారు చెప్పిన విత్తనాలు సాగుకు ఉపయోగిస్తున్నవారిలో అనేకమందికి సత్ఫలితాలు లభించడంలేదు. దీంతో ఏటా రైతులపై ఆర్ధిక భారం అధికమవుతోంది. ఈ సమస్యను అధిగమించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక రాష్ట్రంలోనే వివిధ పంటలకు సంబంధించిన మంచి విత్తనాలు ఉత్పత్తి అయ్యేలా చూస్తోంది. ఈ క్రమంలోనే సర్కార్ విత్తన శుద్ధి కేంద్రాలనూ ఏర్పాటు చేస్తోంది. మెదక్ జిల్లా ములుగు మండలం బండమైలారంలో విత్తనశుద్ధి కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూములు సేకరించింది. త్వరలోనే ఇక్కడ పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మర్కూక్ మండలం కర్కపట్లలో 500 ఎకరాల భూములు సేకరించారు. ఇప్పటికే 350 ఎకరాల్లో దాదాపు 18 పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలిన భూములనూ పరిశ్రమలకు కేటాయించే పనులు జోరందుకున్నాయి.
విత్తనాలు సక్రమంగా ఉంటే మంచి దిగుబడులు వస్తాయి. రైతుకు ఆదాయమూ పెరుగుతుంది. అదే నాసిరకంగా ఉంటే రైతులు పడిన శ్రమ వృథా అవుతుంది. పెట్టుబడులు కూడా రాని దుస్థితిలో కూరుకుపోతారు. అప్పులపాలవుతారు. అందుకే స్వయంగా విత్తనాలు తయారుచేసి రైతులకు అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ లక్ష్యం మేరకు ములుగు మండలం బండమైలారంలో విత్తనశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో భూములు కొనుగోలు చేశారు. ఈ భూముల్లో ప్రభుత్వం ‘సీడ్ పార్క్’ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అన్ని రకాలైన మేలురకం విత్తనాలను తయారుచేస్తారు. వీటిని రాష్ట్రంలోని రైతులందరికీ అందిస్తారు. విత్తన ఉత్పత్తి, శుద్ధి కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన సరకు లభిస్తుందని అంతా భావిస్తున్నారు. అంతేకాక పరిశ్రమల్లోని వివిధ విభాగాల్లో ఉపాధి అవకాశాలు సైతం లభిస్తాయని అంటున్నారు.