YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఏపీలో హాట్ టాపిక్ గా రహస్య భేటీ

 ఏపీలో హాట్ టాపిక్ గా రహస్య భేటీ

 ఏపీలో హాట్ టాపిక్ గా రహస్య భేటీ
విజయవాడ, జూన్ 24
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోసారి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌గా ఉన్న వ్య‌వ‌హారంలో ఇప్పుడు ప్ర‌భుత్వం చేతికి స‌రికొత్త అస్త్రం ల‌భించింది. స‌రిగ్గా ప‌ది రోజుల క్రితం నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌, బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి, మ‌రో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ హైద‌రాబాద్ హోట‌ల్‌లో భేటీ అయిన సీసీటీవీ ఫుటేజ్ బ‌య‌ట‌కు రావ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది.చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మితులైన నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌కు, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అస్స‌లు ప‌డ‌టం లేదు. క‌రోనా వ్యాప్తి కార‌ణాన్ని చూపుతూ ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దించ‌కుండానే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డంతో అస‌లు గొడ‌వ మొద‌లైంది.ఏకంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీడియా ముందుకొచ్చి నిమ్మ‌గ‌డ్డ తీసుకున్న నిర్ణ‌యం వెనుక కుట్ర ఉంద‌ని, చంద్ర‌బాబు ఇందులో పాత్ర‌దారి అనేలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై అనేక ఆరోప‌ణ‌లు చేస్తూ, అస‌లు త‌న‌కు ఏపీలో భ‌ద్ర‌త‌నే లేదు అని పేర్కొంటూ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ కేంద్ర హోంశాఖ‌కు అసాధార‌ణ లేఖ రాశారు.దీంతో ప్ర‌భుత్వం, నిమ్మ‌గ‌డ్డ మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింది. నిమ్మ‌గ‌డ్డ‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌ద‌వీకాలాన్ని త‌గ్గించి నిమ్మ‌గ‌డ్డ స్థానంలో త‌మిళ‌నాడుకు చెందిన జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌ను హుటాహూటిన నియ‌మించింది జ‌గ‌న్ స‌ర్కార్‌. కానీ, నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ హైకోర్టుకు వెళ్లి మ‌రీ త‌న‌కు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు.దీంతో సుప్రీం కోర్టు గ‌డ‌ప‌తొక్కింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ వ్య‌వ‌హారం ఇలా న‌డుస్తున్న స‌మ‌యంలోనే నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ చంద్ర‌బాబు చేతిలో పావుగా మారార‌ని అనేక ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. నిజానికి ఈ వ్య‌వ‌హారంలో వైసీపీపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అన్ని పార్టీలూ వైసీపీ ప్ర‌భుత్వం తీరును, జ‌గ‌న్ నేరుగా చేసిన ఆరోప‌ణ‌ల‌ను త‌ప్పుబ‌ట్టాయి. రాజ్యంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తిపై ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఎవ‌రూ స్వాగ‌తించ‌లేదు. హైకోర్టులోనూ నిమ్మ‌గ‌డ్డ‌కు అనుకూలంగా తీర్పు రావ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రింత డిఫెన్స్‌లో ప‌డింది.ఇటువంటి స‌మ‌యంలో ఈ నెల 13న నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌, సుజ‌నా చౌద‌రి, కామినేని శ్రీనివాస్ పార్క్ హ‌యత్ హోట‌ల్‌లో భేటీ అయ్యార‌ని చెబుతున్న ఓ సీసీ టీవీ ఫుటేజ్ ప‌ది రోజుల త‌ర్వాత అనూహ్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న నిమ్మ‌గ‌డ్డ ఇలా హోట‌ల్‌లో రూంలో ర‌హ‌స్యంగా రాజ‌కీయ నేత‌ల‌ను కల‌వ‌డం వెనుక కుట్ర ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.నిజానికి కోర్టులో, బ‌య‌ట నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌తో గొడ‌వ వ్య‌వ‌హారంలో ఇంత‌కాలం వైసీపీ ప్ర‌భుత్వం ఇరుకున ప‌డిపోయింది. నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌పై వైసీపీ ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా పెద్ద‌గా ఫ‌లితం లేకుండా పోయింది. అన్నివైపులా ప్ర‌భుత్వ‌మే ఇబ్బంది ప‌డింది. కానీ, ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చిన పార్క్ హ‌య‌త్ హోట‌ల్ సీసీ టీవీ ఫుటేజ్‌తో ప్ర‌భుత్వం చేతికి బ్ర‌హ్మాండ‌మైన అస్త్రం ల‌భించిన‌ట్ల‌యింది.తాము ఆరోపిస్తున్న‌ట్లు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ చంద్ర‌బాబు నాయుడు మ‌నిషి అని, ఆయ‌న ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వైసీపీ ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరోప‌ణ‌లు ముమ్మ‌రం చేసింది. నిజానికి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ క‌లిసింది బీజేపీ నేత‌ల‌నే అయినా, చంద్ర‌బాబు, టీడీపీ పాత్ర కూడా ఇందులో ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.అయితే, ఈ వ్య‌వ‌హారంలో టీడీపీ సెల్ప్ గోల్ వేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. బీజేపీ నేత‌ల‌తో నిమ్మ‌గ‌డ్డ భేటీ వివాదాస్ప‌దం అయ్యింది కాబ‌ట్టి వారు వివ‌ర‌ణ ఇచ్చుకుంటారు. కానీ, టీడీపీ భుజాలు త‌డుముకుంది. నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌ను వెన‌కేసుకొచ్చింది. ఈ భేటీ త‌ప్పు కాద‌ని స‌మ‌ర్థించింది. దీంతో త‌మ‌కు సంబంధం లేని వ్య‌వ‌హారంలో టీడీపీ అన‌వ‌స‌రంగా జోక్యం చేసుకున్న‌ట్ల‌యింది.దీంతో వైసీపీకి టీడీపీనే అవ‌కాశం క‌ల్పించిన‌ట్ల‌యింది. ఈ వ్య‌వ‌హారంలో ఎలా స్పందించాల‌నేది బీజేపీకి కూడా అంతుబ‌ట్ట‌డం లేదు. సుజనా చౌద‌రి త‌ప్ప ఎవ‌రూ స్పందించ‌డం లేదు. బీజేపీ కూడా ఈ భేటీతో ఇరుకున‌ప‌డ్డ‌ట్లే క‌నిపిస్తోంది. మొత్తంగా సీసీటీవీ ఫుటేజ్ బ‌య‌ట‌కు రావ‌డంతో టీడీపీ, బీజేపీతో పాటు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌కు కూడా ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. నైతికంగా వైసీపీకి ఈ వ్య‌వ‌హారంలో మంచి అస్త్రం ల‌భించిందని ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే వైసీపీ ఆరోపణలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అది రహస్య భేటీ కాదని, వైసీపీ నేతలవి అర్థం పర్థం లేని ఆరోపణలన్నారు సుజనా. 

Related Posts