జిల్లాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అక్రిడిటేషన్ల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య , జిల్లా ప్రతినిధులు బుధవారం ఉదయం అనంతపురం లోని జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబర్లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కాలవ శ్రీనివాసులును కలిసి వినతి పత్రం సమర్పించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు మంజూరు చేయాలన్నారు.
టీవీ ఛానళ్లకు 18, పెద్ద దినపత్రికలకు, అలాగే చిన్నదినపత్రికలకు అవసరం మేరకు తగినన్ని అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని విన్నవించారు. వార, పక్ష, మాస, ద్వైమాసిక, త్రైమాసిక పత్రికలకు 5 సంవత్సరాల ఆర్ ఎన్నై సీనియారిటీ ఉన్న వాటికి 1+1 ప్రకారం, అలాగే 6నెలల సీనియారిటీ ఉన్న చిన్న పత్రికలకు ఒక అక్రిడిటేషన్ ఇస్తామని నిన్న జరిగిన సమావేశంలో అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ నిర్ణయించారని, ఇలాగైతే చాలామంది చిన్న పత్రికల సంపాదకులు చాలా నష్టపోతారని మంత్రి దృష్టికి సమాఖ్య ప్రతినిధులు తీసుకెళ్లారు.
అర్హులైన సీనియర్ జర్నలిస్టుల కు అక్రిడిటేషన్ల మంజూరులో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా అక్రిడిటేషన్ కలిగి ఉన్న జర్నలిస్ట్ ల పిల్లలకు జిల్లాలోని అన్ని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో మానవతా దృక్పథంతో ఉచిత విద్యను అందించేలా కలెక్టర్ను ఆదేశించాలని సమాఖ్య ప్రతినిధులు కోరారు. అందుకు మంత్రి స్పందిస్తూ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.