సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సముద్ర జీవి
హైద్రాబాద్, జూన్ 24,
అది పాము కాదు. పాములాంటి జీవి అస్సలు కాదు. అది ఒక భిన్నమైన జీవి. ఎక్కడో రాయి మీద పాకుతున్న ఈ వింత జీవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జీవిని పూర్తిగా చూడకపోతే.. ఎవరైనా సరే దీన్ని పామనే అనుకుంటారు. దాని అసలు రూపం చూసిన తర్వాత.. హమ్మయ్య పాము కాదు బతికిపోయామని ఊపిరి పీల్చుకుంటారు. దీన్ని దూరం నుంచి చూస్తే సాలీడు పురుగులా అనిపిస్తుంది. పాము కాలులా ఉన్న ఈ జీవి ఏమిటనేది ఇప్పటికీ తెలియరాలేదు. ఇది నేలపైనా, నీటిలో కూడా జీవించగలగే జీవిలా కనిపిస్తోంది. దీనికి ఉన్న ఐదు కాళ్లు.. పాములాగే తిరుగుతున్నాయి. లేడియా ర్యాలే అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమారు మూడు లక్షల మంది దీన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆ జీవి ఏమిటో తెలుసుకొనేందుకు చాలా కష్టపడుతున్నారు. కొందరు తమకు తెలిసిన కొన్ని జీవుల పేర్లను కూడా చెబుతున్నారు. ఒకరైతే దీనికి స్నేక్ స్పైడర్ అని పేరు పెట్టేశారు. ఇంతకీ ఈ జీవి పేరు ఏమిటో మీకైనా తెలుసా? వీటిని బ్రిట్లే స్టార్ లేదా ఓపిరోయిడ్ (Brittle star or Ophiuroid) అని అంటారు. ఇవి లోతైన నీటిలో జీవిస్తాయి. సముద్రంలో జీవించే నక్షత్ర చేపల తరహాలోనే ఉంటాయి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ఒపిరోయిడ్‌ల కాళ్లు గొంగలి పురుగులను తలపిస్తాయి. ఏది ఏమైనా ఈ వింత జీవి భలే చిత్రంగా ఉంది కదూ.