రష్యా విక్టరీ పరేడ్ లో భారత సైన్యం
మాస్కో, జూన్ 24,
రష్యాలో విజయోత్సవ పరేడ్ అట్టహాసంగా జరిగింది. ఈ పరేడ్‌లో భారత్‌కు చెందిన త్రివిధ దళాల సైనికుల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుధవారం మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద నిర్వహించిన సైనిక పరేడ్‌లో భారత్ దళాలు కవాతు నిర్వహించాయి. భారత్ నుంచి త్రివిధ దళాలకు చెందిన 75 మంది సైనికులు ఈ కవాతులో పాల్గొన్నారు. భారత చిరకాల మిత్రదేశమైన రష్యాలో జరుగుతున్న విజయోత్సవ వేడుకల్లో మన దేశం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.1941-45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీకగా రష్యా ఏటా విజయోత్సవ పరేడ్ (విక్టరీ డే)ను నిర్వహిస్తోంది. ఈసారి 75వ వార్షికోత్సవం కావడంతో ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. నాటి యుద్ధ వీరులకు రష్యా ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. 75వ విజయోత్సవ వేడుకలకు గుర్తుగా భారత్ నుంచి 75 మంది జవాన్లు కవాతులో పాల్గొనడం విశేషం. ఈ పరేడ్‌లో చైనాకు చెందిన దళాలు కూడా పాల్గొన్నాయి.భారత్‌కు చెందిన త్రివిధ దళాల సైనికుల బృందం ఈ పరేడ్‌లో పాల్గొనడం గర్వంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యంపై రష్యా ప్రభుత్వంతో రాజ్‌నాథ్ సింగ్ చర్చలు జరుపనున్నారు.