మోడీకి జై కొట్టిన జనం
న్యూఢిల్లీ, జూన్ 25
భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రజలు మోదీపై అపార విశ్వాసం కనబరుస్తున్నారు. పాకిస్థాన్ కంటే పెద్ద శత్రువుగా మారి చైనా సమస్యను ఎదుర్కోవడానికి మోదీనే సరైన నాయకుడని అభిప్రాయపడుతున్నారు. ఐఏఎన్ఎస్ సీఓటర్ స్నాప్ పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. లడఖ్‌లో ఘర్షణలు తలెత్తిన కొద్ది రోజుల తర్వాత ఈ పోల్ నిర్వహించగా.. ప్రజలు మోదీ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారని తేలింది.ఇన్నాళ్లూ దేశానికి ప్రథమ శత్రువుగా పాకిస్థాన్‌ను భావించిన ప్రజలు ఇప్పుడు చైనాను మొదటి శత్రువుగా భావిస్తున్నారు. డ్రాగన్‌తో ఢీకొట్టడానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీల కంటే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వమే మెరుగైందని సీఓటర్ సర్వేలో పాల్గొన్న వారిలో 73.6 శాతం మంది అభిప్రాయపడ్డారు.భారత్‌కు చైనా పెద్ద తలనొప్పిగా మారిందని 68.3 శాతం మంది అభిప్రాయపడగా... ఇప్పటికీ పాకిస్థాన్ నుంచే ఎక్కువ ముప్పు పొంచి ఉందని 31.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. చైనాకు భారత్ ఇప్పటికీ ధీటైన జవాబు ఇవ్వలేదని 60 శాతం మంది భావిస్తుండగా.. మన దేశం సరైన జవాబు ఇచ్చిందని 39.8 శాతం మంది అభిప్రాయపడ్డారు.మేడిన్ చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయబోమని 68.2 శాతం మంది చెపపగా. 31.8 శాతం మంది చైనా వస్తువులను కొనుగోలు చేస్తామని బదులిచ్చారు. మోదీపై రాహుల్ గాంధీ విమర్శల దాడి చేయడం సరికాదని చాలా మంది భావిస్తున్నారు. జాతీయ భద్రత విషయంలో రాహుల్ గాంధీని నమ్మబోమని 61.3 శాతం మంది చెప్పగా... 39 శాతం మంది రాహుల్ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.