ఈవెంట్ మేనేజ్ మెంట్స్ కు లేని డిమాండ్
హైద్రాబాద్, జూన్ 25
కరోనా లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ పలు రంగాలు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనా నిబంధనలలో భాగంగా పెళ్ళిళ్ల తీరే మారిపోయింది. అతి తక్కువమంది అతిథులుతో పెళ్లితంతు ముగించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఫోటో స్టూడియోలకు గిరాకీ లేకుండా పోయింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేసేవాళ్లు గోళ్లు గిల్లుకోవాల్సిన అగత్యమేర్పడింది. గతంలో ఈ సీజన్‌లోనే ఆయా రంగాల వారు అంతో ఇంతో వెనకేసుకునేవారు. ఆ వచ్చిన డబ్బులతో సదరు ఫోటో స్టూడియో, ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వాహకులు తమ కింద పనిచేసే ఉద్యోగులకు జీతభత్యాలు, ఇత్యాది సమకూర్చుకునేవారు.ఇంకా మిగులు డబ్బులతో ఇతర నెలల ఖర్చులు సైతం చెల్లించుకునే మెరుగైన పరిస్థితులు ఉండేవి. మిగిలిన కాలంలో ఇతరత్రా చిన్న కార్యక్రమాలకు వెళుతూ తాము జీవనోపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధిని అందించేవారు. ప్రస్తుతం కరోనా తెచ్చిన కష్టాలతో ఆయా రంగా ల నిర్వాహకులు పూర్తిస్థాయిలో డైలమాలో పడిపోయారు. కరోనాతో ఫంక్షన్‌హాల్స్ మూతపడ్డా యి. దీంతో, ఫంక్షన్‌హాల్స్ నిర్వాహకుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. గతంలో పెళ్ళిళ్ల సీజన్ వస్తే చాలు.. ఫోటోస్టూడియోలకు ఎనలేని గిరాకీ ఉండేది. ఫోటో, వీడియోగ్రాఫర్లు ఫుల్ బిజీగా ఉండేవారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లు కళకళలాడేవి. రాష్ట్రవ్యాప్తంగా పెళ్ళిళ్లు కొనసాగినా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివాహాలు ఎక్కువగా జరిగేవి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫంక్షన్ హాల్స్‌ను సైతం ఒక నెల ముందుగా రిజర్వు చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేది.ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి పూర్తి రివర్స్‌లో ఉంది. ఫంక్షన్‌హాల్స్ లేనే లేవు. కొద్దిపాటి మందితో వివాహాది శుభకార్యాలు జరిపించుకునే స్థితిలో ఫోటో, వీడియోగ్రాఫర్ల ఊసే లేని విధంగా పెళ్లి తంతు ముగించేస్తున్నారు. కొందరు ఫోటో స్టూడియో, ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వాహకులను సంప్రదించగా.. వారు తమ కన్నీటి వ్యథను తెలియజేస్తున్నారు. కరోనా నిబంధనల సడలింపులో తమకు అనుమతులించినప్పటికీ తమకు ఒరిగిందేమీ లేదని వారు వాపోతున్నారు. కొందరు ఫోటో స్టూడియో నిర్వాహకులైతే.. ఇంతవరకు తమ ఫోటో, వీడియోగ్రాఫర్లు తమ సాధనాలను బయటికి తీసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలను కదిలించగా.. వారి పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. పైపెచ్చు ఏ పనులు లేక ఖాళీగా కూర్చుంటున్నామని పరిస్థితి దీనాతిదీనంగా ఉందని తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు.పరిస్థితులు ఎలా ఉన్నా మున్ముందు పరిస్థితులు ఆశాజనకంగా ఉండగలవనే గంపెడాశతో ఫోటో స్టూడియో, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు కాలం వెలిబుచ్చుతున్నాయి. ఇదే సమయంలో కష్టనష్టాలను ఓర్చుతూ తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు తృణమో పణమో అందిస్తూ వారిని దూరం కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నానాటికి తీవ్రతరం కానుండటంతో పరిస్థితులు చక్కబడి ఎప్పటికి మెరుగై పూర్వవైభవం వస్తుందోనని ఆశగా ఎదురుచూడటం తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో తామేమీ చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆయా రంగాల నిర్వాహకులు చెబుతున్నారు. కొందరు మాత్రం త్వరలోనే పరిస్థితులు చక్కబడి తమకు మంచి రోజులొస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తపర్చారు. ఏది ఏమైనా కరోనా కల్లోలం అన్ని రంగాలపై పెను ప్రభావమే కనబర్చింది.