సైనిక చర్యకు వెనుకాడేది లేదు
న్యూఢిల్లీ, జూన్ 26
సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు దీటుగా బదులివ్వాలని భారత్ నిర్ణయించింది. చర్చల ద్వారా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని, అవసరమైతే సైనిక చర్యలకు ఉపేక్షించబోమని భారత్ స్పష్టం చేసింది.చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకున్న వేళ.. ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె ప్రధాని నరేంద్రమోదీతో గురువారం సాయంత్రం భేటీ కానున్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, సైనిక సన్నద్ధతపై ప్రధానికి ఆర్మీ చీఫ్ వివరించనున్నారని సమాచారం. చైనా సరిహద్దుల్లోని లేహ్, కశ్మీర్ ప్రాంతాల్లో ఆర్మీ చీఫ్ రెండు రోజుల పర్యటన ముగిసిన సంగతి తెలిసిందే.పది రోజుల కిందట గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోగా.. ఈ ఘటనలో 21 మంది భారత జవాన్లు అమరులయ్యారు. మరో 76 మంది సైనికులు గాయపడ్డారు. అటు, చైనావైపున కూడా ప్రాణనష్టం భారీగా జరిగినట్టు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. గాల్వన్ ఘర్షణతో సరిహద్దుల్లో ఉద్రికత్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలూ తమ సైన్యాలు భారీగా అక్కడికి తరలిస్తున్నాయి. మరోవైపు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సైనిక, దౌత్య పరమైన చర్చలు కొనసాగుతున్నాయి.ఓవైపు చర్చల పేరుతో శాంతి వచనాలు పలుకుతున్న డ్రాగన్.. మరోవైపు గల్వాన్ లోయ సమరానికి సైన్యాలను సిద్ధం చేస్తూ తన కుటిల నీతిని బయటపెడుతోంది. అంతేకాదు మాటమార్చి తొలుత భారత సైనికులే తమను కవ్వించారని తప్పుదోవ పట్టించేలా కళ్లబొల్లి కబుర్లు చెబుతోంది.భారత్ నుంచి ప్రతిదాడి ఎదురవుతుందని, తొలుత చైనా సైన్యం ఊహించలేకపోయిందని, భారత జవాన్లు తిరగబడేసరికి వారు చాలా భయపడ్డారని జవాన్లకు నిర్వహించిన పరీక్షల్లో తేలిందని చెప్పారు. ఆ ఘటన తర్వాత భారత్ నుంచి పెద్ద స్థాయిలో ప్రతిదాడి జరుగుతుందని భావించిన చైనా సైన్యాధికారులు వణికిపోయినట్లు తెలిసింది. అలాగే భారత జవాన్లు బందీలుగా ఉన్న సమయంలోనూ వాళ్లకేం చేయాలో అర్థంకాలేదని సైనికులు తెలిపారు.ఈ నేపథ్యంలో సైన్యాధిపతి ఎంఎం నరవాణఏ లడఖ్, లెహ్ ప్రాంతాల్లో పర్యటించారు. చైనాను ఎదుర్కొనేందుకు భారత సైన్యం సన్నద్ధతను పరిశీలించారు. గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో వీరోచితం పోరాడిన జవాన్లకు ప్రశంసా బ్యాడ్జీలు బహూకరించారు. సైన్యం పోరాట సన్నద్ధత గురించి ఆర్మీ చీఫ్ ప్రధానితో మాట్లాడతారని తెలుస్తోంది.