ప్రైవేట్ ఆస్పత్రులు బాదేస్తున్నారు
హైద్రాబాద్, జూన్ 26,
మొన్నటి వరకూ కరోనా సోకితే ప్రభుత్వం చూసుకుంటుందిలే అనే ఒక ధైర్యం ఉండేది. ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలు కరోనా బారిన పడినా ఆర్థికంగా పెద్దగా నష్టపోయేవారు కాదు. ఎందుకంటే కరోనా టెస్ట్ ల దగ్గర నుంచి చికిత్స తో పాటు మందులను కూడా ప్రభుత్వమే చూసుకునేది. గాంధీ ఆసుపత్రికి తరలించి పథ్నాలుగు రోజుల పాటు వ్యాధి తీవ్రతను బట్టి ఐసొలేషన్ వార్డు లో ఉంచేది. దీంతో కరోనా భారం పెద్దగా ప్రజలకు తెలియలేదు. వేల మంది ఉచితంగా చికిత్స పొంది తమ ఇళ్లకు సురక్షితంగా చేరుకున్నారు.ప్రజలకు పైసా ఖర్చు లేకుండా కరోనా వ్యాధికి చికిత్స అందించిన ప్రభుత్వం ప్రస్తుతం ప్రయివేటు ఆసుపత్రులకు బాధ్యతను అప్పగించింది. గాంధీ ఆసుపత్రిలో ఎక్కువ కేసులకు చికిత్స జరుగుతుండటం, తగిన సంఖ్యలో బెడ్స్ లేకపోవడంతో ప్రభుత్వం ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పరీక్షలతో పాటు చికిత్స చేయించుకునేందుకు అవసరమైన ధరలను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది.ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా టెస్ట్ లకు రూ.2200లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి రోజుకు నాలుగువేల రూపాయలు, వెంటిలేటర్ పై చికిత్స చేసే వారి నుంచి 9 వేలు, ఐసీయూలో అయితే ఏడు వేలకు మించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అభ్యంతరం తెలిపాయి. తమకు గిట్టుబాటు కాదని తేల్చి చెప్పాయి. వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ తో భేటీ అయి చర్చించారు.అయినా ప్రభుత్వం మాత్రం తాము నిర్ణయించిన ధరలకే చికిత్స చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి. ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరితే కోవిడ్ అని నిర్ణారణ అయిన తర్వాత రోజుకు లక్ష వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ముందు సొమ్ము చెల్లిస్తేనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవడం కూడా చర్చనీయాంశమైంది. గత నాలుగు నెలలుగా వ్యాపారాలు లేని ప్రయివేటు ఆసుపత్రులు ఇప్పుడు దోపిడీకి దిగినట్లే కన్పిస్తుంది. కరోనా ప్రయివేటు చికిత్సల ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ప్రజలు తమ ఆస్తులను అమ్ముకోక తప్పదు.