YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 పవార్ నే నమ్ముకున్న ఉద్ధవ్

 పవార్ నే నమ్ముకున్న ఉద్ధవ్

 పవార్ నే నమ్ముకున్న ఉద్ధవ్
ముంబై,  జూన్ 26, 
ఇతరులపై ఆధారపడినప్పుడు ఏం చేస్తాం. అందరిని కలుపుకుని పోయేలా ప్రయత్నిస్తాం. తనకు మద్దతిచ్చే ఇద్దరిని వేర్వేరు కోణాల్లో చూడటమంటే అది ఖచ్చితంగా రాజకీయమే. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే జరుగుతుందని చెబుతున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ లో లుకలుకలు బయలుదేరడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వ్యవహారశైలి మాత్రమేనని పలువురు అంటున్నారు. ఆయన కాంగ్రెస్ నేతలకు పెద్దగా విలువను ఇవ్వరంటున్నారు.ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారంటే కాంగ్రెస్ చలవే కారణం. ఒక దశలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సయితం ఉద్ధవ్ థాక్రేకు మద్దతు ప్రకటించే విషయంలో ఆలోచించారంటారు. శరద్ పవార్ మద్దతు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ ఇవ్వలేదు. సోనియా గాంధీ అందరితో చర్చించిన తర్వాతనే ఉద్ధవ్ థాక్రే కు షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సోనియా గాంధీ ప్రకటన వచ్చేంత వరకూ ఉద్ధవ్ థాక్రే కొంత టెన్షన్ పడ్డ మాట వాస్తవమే.ఎట్టకేలకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయింది. మూడు పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది. మంత్రివర్గంలో తమ పార్టీ సభ్యుల సంఖ్యలో కాని, కీలక శాఖల కేటాయింపులో కాని ఉద్ధవ్ థాక్రే వివక్ష చూపారన్నది కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శ. మంత్రివర్గం ఏర్పాటయిన తొలినాళ్లలోనే కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ఈ విమర్శలు చేశారు. అయినా ఉద్ధవ్ థాక్రే ఎలాంటి భయానికి గురికాలేదు. తనకు శరద్ పవార్ మద్దతు ఉన్నంత కాలం పదవికి ఢోకా ఉండదన్నది ఆయన విశ్వాసం.
శరద్ పవార్ ఎలా చెబితే కాంగ్రెస్ హైకమాండ్ అలా నడుచుకుంటుందన్నది కూడా ఉద్ధవ్ థాక్రే భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్ధవ్ థాక్రే పెద్దగా లెక్క చేయడం లేదు. కరోనా నియంత్రణపై జరిపిన వివిధ సమావేశాల్లోనూ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. వారికి ఆహ్వానం కూడా లేదు. దీంతోనే మహారాష్ట్ర సంకీర్ణంలోని కాంగ్రెస్ పార్టీ నేతల్లో అసహనం వ్యక్తమయిందంటున్నారు. అయితే ఈ అసహనాలు, అసంతృప్తులు పార్టీలో సహజమేనని, సర్దుకుపోవడం మినహా కాంగ్రెస్ కు వేరే దారిలేదన్నది శివసేన అభిప్రాయంగా ఉంది.

Related Posts