వ్యాపారాలు ల్లేవు.... బయిటకు రాని జనం
హైద్రాబాద్, జూన్ 26,
లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చి దాదాపు ఇరవై రోజులు కావస్తుంది. కానీ ఎలాంటి బేరాల్లేవ్. వినియోగదారులు షాపులు వద్దకు రావడమే మానుకున్నారు. మాల్స్, హోటల్స్ అయితే పూర్తిగా ఈగలు తోలుకుంటున్నట్లే కనపడుతుంది. దీంతో మాల్స్, హోటల్స్ యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఐదో విడత లాక్ డౌన్ జూన్ మూడో తేదీ నుంచి ప్రారంభమయింది. అంతకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మినహాయింపులు ఇచ్చాయి.కానీ నాలుగోవిడత లాక్ డౌన్ ముగిసిన తర్వాత ప్రధానంగా హోటళ్లు, మాల్స్ కు అనుమతులు మంజూరు చేశాయి. దీంతో గత రెండు నెలల నుంచి షట్టర్లు క్లోజ్ చేసి ఉండటంతో హడావిడిగా తెరిచేశారు. అయితే హోటళ్లకు, మాల్స్ కు ప్రజలు పెద్దగా రావడం లేదు. ప్రధానంగా హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కవగా ఉండటం, రోజురోజుకూ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు హోటళ్లు, మాల్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు.కరోనాకు ముందు కుటుంబ సభ్యులతో సహా కలసి వచ్చే వారు ఇప్పుడు ఒక్కరిగా వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదు. తాను ఒక్కడినే వచ్పినా కరోనా ను ఇంటికి మోసుకెళతాననే భయంతోనే ప్రజలు పెద్దగా ఫుడ్ పట్ల ఆసక్తి చూపడం లేదంటున్నారు. హైదరాబాద్ లో దాదాపు 70 శాతం వ్యాపారం పడిపోయిందన్నది వ్యాపారులు చెబుతున్న మాట. తాము కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసకుంటున్నా ప్రజలు ఇటువైపు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరో మూడు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. దసరా నాటికి కొంత వ్యాపారాలు పుంజుకునే అవకాశముందని చెబుతున్నారు. ఈ నాలుగు నెలలు షాపుల అద్దెలు, సిబ్బంది జీతాలు చెల్లించక తప్పని పరిస్థితి ఉందంటున్నారు. దీంతో అనేక హోటల్స్ యజమానులు టేక్ అవే కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ప్రజలు కరోనా తగ్గిన తర్వాతనే కొంత మాల్స్ , హోటళ్లకు వచ్చే అవకాశముంది. ఈలోపు వ్యాపారాలు ఉండవని వారు మానసికంగా ఫిక్స్ అయిపోయారు. మొత్తం మీద ద్వారాలు తెరిచినా కస్టమర్లు లేక హోటళ్లు, మాల్స్ హైదరాబాద్ లో వెలవెల బోతున్నాయి.