గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని ఇద్దరు చంద్రులు వేయి కళ్లతో వేచి చూస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గాలు పెరిగితే తమకు అవకాశం వస్తుందని ఎంతో మంది ఆశావహులు వేచి చూస్తున్నారు. అయితే ఇంత వరకూ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనతో అసెంబ్లీ సీట్ల పెంపుపై ఓ క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.."పునర్విభజనపై ఢిల్లీ నుంచి సానుకూల సంకేతాలున్నాయి. ఏపీపై కేంద్ర దృక్పథంలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యే వాతావరణం కనిపిస్తోంది. విభజన హామీలను అమలుచేయకపోతే కోర్టుకు వెళతానన్న వ్యాఖ్యలపై కొందరు అతిగా ఫోకస్ చేసి వక్రీకరించారని చెప్పారు. సహజ హక్కును వినియోగించుకోవడంలో తప్పేముంది?" అని ఆయన చెప్పుకొచ్చారు.