YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 కొత్త మంత్రికి సన్ స్ట్రోక్...

 కొత్త మంత్రికి సన్ స్ట్రోక్...

 కొత్త మంత్రికి సన్ స్ట్రోక్...
ఏలూరు, జూన్ 27,
రెండున్నరేళ్ల మంత్రి ప‌ద‌వి. త‌ర్వాత ఉంటుందో ఊడుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. పైగా అన్ని ఆశ‌లు అయిపోయాయ‌నుకునే ప‌రిస్థితిలో అనూహ్యంగా ద‌క్కిన మంత్రి ప‌ద‌వి. దీనిని ఇప్పుడే వాడేసుకో వాలి. లేక‌పోతే.. క‌ష్టమే. అంతేనా.. త‌న మంత్రి ప‌ద‌విని ప‌టిష్టం చేసుకునేందుకు కూడా ప్రయ‌త్నాలు. ఇవీ.. ఏడాది కాలంలో ఆ మంత్రి మ‌దిలో మెదిలిన ఆలోచ‌న‌లు. త‌న‌కు న‌చ్చని శాఖ‌ను అప్పగించార‌నే ఆవేద‌న ఒక‌వైపు.. త‌న‌కు అనుకూల‌మైన శాఖ‌ను ఇవ్వలేద‌నే బాధ మ‌రో వైపు.. మొత్తంగా ఆ మంత్రిని చిత్తుగా ఇబ్బంది పెట్టాయి. దీంతో ఈ ఏడాది కాలంలో ఆయ‌న ఏం చేసినా వివాద‌మే అయింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన మంత్రి శ్రీరంగనాథ రాజు. అనూహ్య రీతిలో గ‌త ఏడాది వైసీపీ త‌ర‌ఫున టికెట్ ద‌క్కించుకుని పోటీ చేసి విజ‌యం సాధించిన ఆయ‌న.. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా అవ‌కాశం ద‌క్కించుకున్నారు. వాస్తవంగా క్షత్రియ సామాజిక వ‌ర్గం కోటాలో ఈ ప‌ద‌విని న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద‌రాజుకు ఇవ్వాల్సి ఉంది. ప్రసాద‌రాజు జ‌గ‌న్ కోసం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకుని మ‌రల ఎన్నిక‌ల‌కు వెళ్లి ఓడిపోయారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ సూచ‌న మేర‌కు ఇష్టం లేక‌పోయినా నియోజ‌క‌వ‌ర్గం మారి మ‌రోసారి ఓడారు.అయితే క్షత్రియ సామాజిక వ‌ర్గంలో పెద్దలు అంద‌రూ జ‌గ‌న్‌ను క‌లిసి సీనియ‌ర్ అయిన రంగ‌నాథరాజుకే మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని చెప్పడంతో చివ‌ర‌కు తొలి విడ‌త‌గా జ‌గ‌న్ ఆయ‌న‌కే మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. కానీ, ఆయ‌న‌కు ఇష్టమైన శాఖ పౌర స‌ర‌ఫ‌రాలు. కానీ, జ‌గ‌న్ వ్యూహాత్మకంగా దీనిని కృష్ణా జిల్లాకు చెందిన నాయ‌కుడికి క‌ట్టబెట్టారు. ఎందుకంటే ఈ శాఖ‌లో ఆయ‌న కొన్ని సంవ‌త్సరాలుగా ప‌ట్టు సాధించారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న స‌న్నిహితుల వ్యాపారాలు అన్ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌తోనే ముడిప‌డి ఉన్నాయి.జ‌గ‌న్ మాత్రం ఆ శాఖ‌ను శ్రీరంగనాథ రాజుకు ఇవ్వలేదు. దీంతో రంగ‌నాథ‌రాజులో అసంతృప్తి. అయినా.. మ‌న‌సును నిల‌బెట్టుకోలేక‌.. ఆయ‌న పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో వేలు పెడుతుండేవారు. ఇది కొన్నాళ్ల పాటు వివాదానికి కూడా దారితీసింది. ఇక‌, రాజ‌కీయంగా కూడా ఆయ‌న కుమారుడు క‌మీష‌న్లకు పాల్పడ్డార‌నే ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున జిల్లాలో వినిపించాయి. పార్టీలోనూ నేత‌ల‌కు- నేత‌ల‌కు మ‌ధ్య ఆయ‌న వివాదాలు సృష్టించార‌నే పేరు తెచ్చుకు న్నారు. దీంతో పార్టీలో కేడ‌ర్‌కు కూడా ఆయ‌న దూర‌మ‌య్యారు. పార్టీని ముందుండి న‌డిపించ‌డంలోనూ రంగనాథ‌రాజు విఫ‌ల‌మ‌య్యార‌నే పేరు తెచ్చుకున్నారు.ఇక న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ‌కృష్ణంరాజు మంత్రిపై తీవ్ర విమ‌ర్శలు చేయ‌డంతో పాటు పెద్ద దొంగ అని ఓపెన్‌గానే కామెంట్ చేశారు. ఇక ఆయ‌న‌తో పాటు ఆయ‌న త‌న‌యుడిపై అవినీతి ఆరోప‌ణ‌లు యేడాదికే రావ‌డం మైన‌స్ అయ్యింది. ఇదిలా ఉంటే డెల్టాలో త‌న‌కు సంబంధం లేని రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం మంత్రి వేలు పెట్టి ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని పైకి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చినా కూడా జ‌గ‌న్ శ్రీరంగనాథ రాజు తీరు మారలేదు.ఓవ‌రాల్‌గా ఏడాది కాలంగా శ్రీరంగనాథ రాజు జ‌గ‌న్ వ్యూహాల‌కు అనుగుణంగాఆయ‌న న‌డుచు కోలేక పోయారు. మొత్తంగా ప‌రిశీలిస్తే.. త‌న వ్యక్తిగ‌త ఎజెండాకు ప్రాధాన్యం ఇవ్వడం, త‌న‌కు సంబంధం లేని శాఖ‌లో క‌లుగ‌జేసుకోవ‌డం, పార్టీలో త‌న ఆధిప‌త్యం కోసం ప్రయాస‌ప‌డ‌డం వంటి కార‌ణంగా ఈయ‌నకు జ‌గ‌న్ ద‌గ్గర మైన‌స్ మార్కులే ప‌డ్డాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related Posts