శ్రీరాముని భక్తులలో సర్వోత్తముడు, అగ్రగణ్యుడు. శ్రీరామునితోపాటు ఆరాధించబడుతున్నవాడు. భక్తుడే అయినా భగవంతునికి ధీటుగా అందరి పూజలు అందుకుంటున్న భక్తుడు.. ఈ భక్తునకు ఎందరో భక్తులు ! ఊరూరా, వాడవాడలా రామభక్తుని దేవాలయాలు, నిలువెత్తు విగ్రహాలు వెలిశాయి.. వెలుస్తునే ఉన్నాయి. వాయుదేవుని అంశవల్ల, అంజనీదేవికి జన్మించిన ఈ వాయుపుత్రుడు.. అంజనీ తనయుడు.. ఆంజనేయుడు. సూర్యుని వద్ద వేద శాస్త్రాలు నేర్చిన హనుమంతుడు అపార గుణ సంపన్నుడు.. బాల బ్రహ్మచారి, మహావీరుడు, నిర్భయుడు, సత్యవాది, స్వామిభక్తుడు, యుద్ధ విద్యానిపుణుడు, ఇచ్ఛారూపధారణా సమర్థుడు, సదాచారి.. ఇలా ఎన్నో, ఎన్నెన్నో గుణాలు.అడవిలో శ్రీరామ లక్ష్మణులను చూసి, తన రాజు సుగ్రీవుని ఆజ్ఞమేరకు చతురస సంభాషణలతో వారి వివరాలు సేకరించి, రామసుగ్రీవులకు మైత్రిగావించాడు అగ్నిసాక్షిగా. ‘బుద్ధిశాలి’యైన దూత వుంటే రాజు (రాచ) కార్యాలు సిద్ధించడానికి, ఆ దూత యొక్క సంభాషణలు చాలు అని శ్రీరామునిచే ప్రశంసించబడ్డాడు తొలి పరిచయంలోనే ! శ్రీరాముడు వాలిని వధించి సుగ్రీవుని, కిష్కింధకు రాజుగా చేశాడు. ఆ సుగ్రీవుని ఆజ్ఞతో సీతాన్వేషణకు బదులుదేరాడు వీరాధివీరుడు పెక్కుమంది వానరులను వెంటబెట్టుకుని బయలుదేరి, సముద్రాన్ని లంఘించి, లంకిణిని అణచి, లంకలో ప్రవేశించి, లంకంతా గాలించి, సీత జాడ కనుగొన్న కార్యసాధకుడు ! ‘సీత జాడ కనుగొనగలడన్న నమ్మకంతోనే నేమో.. శ్రీరాముడు తన అంగుళీయకాన్ని (ఉంగరాన్ని) ఆనవాలుగా హనుమ చేతిలోనే పెట్టాడు ! ఆయన కార్యదక్షతపై ఎంత నమ్మకమో ఆ రామచంద్రునకు ! ఆ గుణవంతుని ! సీతమ్మ ఇచ్చిన ‘శిరోమణి’ శ్రీరామునకందించి, తన స్వామికి ఊరట కలిగించాడు స్వామి భక్తుడు ! వానర సేనలను వెంట బెట్టుకుని, శ్రీరామ సుగ్రీవాదులు సముద్రతీరం చేరారు. సముద్రం దాటడమెలా ? సముద్రుని సూచన మేరకు ‘సముద్రం’పై వారధి నిర్మించారు. వానర సేనలు లంకలో ప్రవేశించాయి. ఈ కార్యక్రమ నిర్వహణలో హనుమంతునిదే పైచెయ్యి ! రామ రావణుల సంగ్రామ సమయంలో ఎందరో, ఎందరెందరో రాక్షస ప్రముఖుల పీచమణచిన ఈ కపియోధుడు, మేఘనాధుడేసిన శక్తి సోకి మూర్ఛిల్లిన లక్ష్మణుని చూసి శోకిస్తున్న తన స్వామికి ఊరట కలిగించాడు. సంజీవని తెచ్చి సౌమిత్రి ప్రాణాలు నిలిపిన స్వామి భక్తుడు.. లక్ష్మణ ప్రాణదాత ! అన్న రావణునిచే రాజ్యం నుండి వెళ్ళగొట్టబడిన విభీషణుడు శ్రీరాముని శరణు గోరి వచ్చాడు. ‘విభీషణ శరణాగతి’ పట్ల భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి వానర ముఖ్యులనుండి. అంతట హనుమ ‘దుర్మార్గం తలపెట్టిన వాలిని వధించి, తమ్ముడైన సుగ్రీవునకు పట్టం గట్టావు. అలాగే తనకూ న్యాయం జరుగుగుతుందనే ఆశతో వచ్చాడు విభీషణుడు నీ కడకు. అని విభీషణ శరణాగతిలోని ఆంతర్యాన్ని అంచనా వేసి ‘శరణు’ ఇయ్యడమే యుక్తమనే సూక్ష్మాన్ని శ్రీరామునకు చెప్పకనే చెప్పిన సూక్ష్మగ్రాహి, వివేచనా పరుడు హనుమ ! _సంగ్రామంలో కుంభకర్ణాది వీరులందరితోపాటు రావణుని హతమార్చిన శ్రీరామునిచే లంకకు విభీషణునిరాజు చేయించి వైదేహిని రాముని దరికి చేర్చి అయోధ్యకేతెంచి బంధుజనులు (బంధువులు + జనులు) మెచ్చగా శ్రీరామ పట్టాభిషేకం చేయించిన కార్యదీక్షా పరాయణుడు శ్రీరామదూత, శ్రీరామభక్తుడు హనుమ. హనుమను ఆరాధించుట, ఆయన ద్వారా శ్రీరాముని ఆరాధించుటే ! తారకమంత్ర (రామనామం) జపానురక్తుడు హనుమ. శ్రీరాముని మెప్పు పొందిన అదృష్టవంతుడు. హనుమ చేసిన ఉపకారానికి బదులుగా ఇంతకంటె ఇంకేమీయగలను నీ కనుచు రాముడిచ్చాడు హనుమకు ‘కౌగిలింత’ ! ఇంతటి భాగ్యం ఎప్పుడైనా ఎవరికైనా ఎందైనా అబ్బినదా ? అదే శ్రీరామ హనుమల బంధం.. అనుబంధం. లోకబాంధవునకే ఆత్మబంధువు హనుమ !! దేశభక్తి, దైవభక్తికి ప్రతిరూపమైన హనుమకు ప్రణమిల్లుతూ...
వరకాల మురళీమోహన్ సౌజన్యంతో