YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖపై ఆచితూచి అడుగులు...

విశాఖపై ఆచితూచి అడుగులు...

విశాఖపై ఆచితూచి అడుగులు...
విశాఖపట్టణం, జూన్ 27,
విశాఖ అంటే జగన్ కి మోజు. కానీ అదేంటో ఎపుడూ ఆయనకు అందకుండానే పోతోంది. విశాఖ మీద నమ్మకంతో తన తల్లి విజయమ్మను 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయిస్తే లక్ష ఓట్ల తేడాతో భారీ పరాజయం దక్కింది. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో మూడంటే మూడు సీట్లు వచ్చాయి. ఇక 2019 ఎన్నికల్లో మొత్తం జగన్ మయం అయిన వేళ కూడా విశాఖ సిటీ ఉలకలేదు, పలకలేదు, ఇక లాభం లేదు, విశాఖలోనే మకాం వేసి మొత్తం రాజకీయాన్ని ఒడిసిపట్టేయాలని పరిపాలనా రాజధాని పేరిట చేసిన హడావుడి కూడా చివరికి వర్కౌట్ కాక త్రిశంకు స్వర్గంలో పడింది. జగన్ కి ఇపుడు విపక్షం నుంచి కోర్టుల నుంచి అడ్డంకులే కాదు, ప్రకృతి సైతం ప్రతికూలం కావడంతో విశాఖ అందని పండే అవుతోంది.ఏముంది విశాఖను రాజధాని చేసుకుంటే పదివేల కోట్లతో చక్కగా పూర్తి అవుతుంది. ఆల్రేడీ టైర్ వన్ సిటీగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. ఆంధ్రాలో ఏకైక‌ మెగా సిటీ. దాన్ని వాడుకుంటే రానున్న కాలంలో ఏపీ మొత్తానికి నిధులు ఇచ్చే కల్పతల్లి అవుతుంది. ఇదీ జగన్ ఆలోచన. ఇదే మాటను ఆయన ఆరేడు నెలల క్రితం నిండు అసెంబ్లీలో మాట్లాడినపుడు నిబ్బరంగా కనిపించారు. ఆ తరువాత వరసగా కష్టాలు ఒకదాని వెనక ఒకటి అన్నట్లుగా వచ్చేశాయి. ఇక ప్రపంచం ఎన్నడూ ఊహించని పెను విపత్తు కరోనా రూపంలో వచ్చి కరాళ న్రుత్యం చేస్తోంది. ఈ నేపధ్యంలో మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థే కుప్పకూలిపోయింది. అసలే అప్పుల్లో ఉన్న ఏపీ గురించి వేరేగా చెప్పాలా. అందుకే ఆనాడు పదివేల కోట్లు అన్న జగన్ కి ఇపుడు అవే అతి భారమైన నిధులుగా కనిపిస్తున్నాయట.ఇపుడున్న పరిస్థితుల్లో ఇటుక తీసి ఇటుక పెట్టే ఆర్ధిక స్తోమత కూడా ఏపీ సర్కార్ కి లేదు. ఇక జగన్ చేతికి ఎముక లేకుండా చేసిన వాగ్దానాలే రానున్న రోజుల్లో సంకెళ్ళు అవుతాయా అన్న భయం కూడా ఉంది. మిగిలిన నాలుగేళ్ళూ నవరత్నాలు ఇస్తూ పోవాలి. వాటికి నిధుల వెతుకులాట అతిపెద్ద ప్రయత్నం. ఇలాంటి టైంలో మూడు రాజధానుల కధను ముందుకు తెస్తే అంతా అస్తవ్యస్థమై కధ మళ్ళీ మొదటికి వస్తుంది. ఆర్ధికంగా పెను భారం కూడా అవుతుంది. అందుకే పరిస్థితులు అనుకూలించేవరకూ ఆమరావతిలో లో ఉండడమే బెటర్ అని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.ఇక విశాఖ రాజధాని ప్రతిపాదన అలాగే ఉందని, కానీ అది ఇప్పట్లో కాదని వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డు గా చెబుతున్నారు. గట్టిగా చెప్పాలంటే 2024 ఎన్నికల తరువాత మళ్లీ వైసీపీ వస్తే అపుడు రాజధాని కదలిక ఉండవచ్చునని కూడా అంటున్నారు. దానికి గల కారణాలు కూడా చెబుతున్నారు. ఎటూ ఒక ఏడాది పూర్తి అయింది, కరోనా మహమ్మరితో రెండవ ఏడాది గిర్రున తిరిగేస్తుంది. ఇక మిగిలింది అచ్చంగా మూడేళ్ళు, ఇందులో చివరి ఏడాది ఎన్నికలకు అంకితం చేసినా గట్టిగా మిగిలిన‌ది రెండెళ్ళు, ఈ రెండేళ్లలో మహాద్భుతాలు చేయడం ఇపుడున్న స్థితిలో ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదని అంటున్నారు. అందువల్ల అమరావతిలోనే అన్నీ చూసుకుంటూ విశాఖ మీద అలా ఆశలు పెంచుకోవడమే వైసీపీ హై కమాండ్ కి మిగిలినది అంటున్నారు. మొత్తానికి విశాఖ జగన్ ని మళ్ళీ మోసం చేసిందనుకోవాలేమో.

Related Posts