జూలై 31 వరకు స్కూల్స్ బంద్
న్యూఢిల్లీ, జూన్ 27,
దేశరాజధాని ఢిల్లీ కరోనా వైరస్ తో వణికిపోతోంది. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77240కి చేరుకున్నాయి. కోలుకుని డిశ్చార్జ్ అయినవారు 47091గా నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఢిల్లీలో మరణించినవారి సంఖ్య 2492కి చేరింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఢిల్లీలో 3,390 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ముంబైని మించిపోయింది.ముంబైలో ఏప్రిల్ నెలలో విపరీతంగా కేసులు నమోదైతే , ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్నాళ్లుగా ప్రతీరోజూ వెయ్యి కేసుల వరకు నమోదవుతున్నాయి. ఇప్పటికే కేసుల తీవ్రత దృష్ట్యా ప్రతి ఇంటిలో సర్వే నిర్వహించడం, శానిటైజ్ చేయడం చేస్తున్నారు. మరోవైపు పాఠశాలలు, కాలేజీలు తెరిచే అవకాశం లేదు. కరోనా వైరస్ నుంచి రక్షణకు ఢిల్లీ వాసులకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్యను మూడు రెట్లు పెంచామని ఈ సందర్భంగా వెల్లడించిన ఆయన.. ఢిల్లీలో కరోనా కారణంగా చికిత్స పొందుతున్న వారిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అకస్మాత్తుగా ఆక్సిజన్ లెవల్స్ 90 నుండి 85 శాతానికి పడిపోతున్నా.. 94 శాతం కంటే ఆక్సిజన్ స్థాయి తగ్గడం ప్రమాదకరం అన్నారు. అటువంటివారు లవెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.. అవసరమయిన వారికి ఢిల్లీ ప్రభుత్వం ఉచితంగా ఆక్సిజన్ ఇంటికి సరఫరా చేస్తుందని వెల్లడించారు సీఎం. ప్లాస్మా థెరపీ చికిత్స కోసం ఎల్.ఎన్.జే.పి మరియు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చామని తెలిపారు ఢిల్లీ సీఎం... అయితే, సీరియస్‌గా ఉన్న కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ పనిచేయదని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. అందరూ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఎటువంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ గా నిర్ధారణై.. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆక్సిజన్ అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. కరోనా లాక్‌డౌన్ కారణంగా విద్యా సంవత్సరం ఇప్పటికే ఆలస్యమైంది. పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. కొన్ని పరీక్షలను ఏకంగా రద్దు చేశారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్ననేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జులై 31 వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించినట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. జూలై 1వ తేది నుంచి ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కావాలి. కానీ నెలరోజుల పాటు వాయిదా వేశారు. విద్యార్ధుల తల్లితండ్రుల అభ్యర్ధన, ఆందోళన, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక సిలబస్‌ను 50 శాతం తగ్గించి.. విడతల వారీగా పదో తరగతి క్లాసులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇటు ఏపీ, తెలంగాణల్లో జూలై చివరిలో గానీ ఆగస్టు నెలలో పాఠశాలలు తిరిగి ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నారు అధికారులు.