2020 వరకు నో క్లాస్ రూమ్స్...
న్యూఢిల్లీ, జూన్ 2
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఐటీ ముంబై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం మొత్తం ముఖాముఖి క్లాసులను రద్దు చేసింది. ఇకపై ఆన్‌లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించాలని నిశ్చయించుకుంది. విద్యార్థుల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావించిన ఐఐటీ ముంబై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో స్కూల్ స్థాయిలో ఆన్‌లైన్ విద్యాబోధన జరుగుతోంది. తాజాగా ఐఐటీ బాంబే వంటి పత్రిష్ఠాత్మక సంస్థ కూడా వర్చువల్ బాట పట్టింది. ఈ నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వరంగ విద్యాసంస్థ కూడా ఐఐటీ ముంబై కావడం గమానార్హం.ఆన్‌లైన్ ద్వారా క్లాసులు వినేందుకు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని దాతలను కోరింది. వారు ఆన్‌లైన్ చదువులు కొనసాగించటానికి అవసరమైన ల్యాప్‌టాప్స్, ఇంటర్‌నెట్ కనెక్షన్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవసరమవుతాయని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విన్నవించింది.ఈ మేరకు ఐఐటీ బాంబే డైరెక్టర్ ఫ్రొ. శుభాశిశ్ చౌదరి ఈ విషయాల్ని ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. విద్యార్థుల రక్షణకే ఐఐటీ బాంబే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. అయితే కరోనా సంక్షోభం నెలకొన్న తరుణంలో బోధన ఎలా సాగాలనే అంశంపై మేము లోతైన సమీక్ష జరిపాం. కొత్త సెమిస్టర్‌లో బోధన పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరపాలని నిర్ణయించాం అని ఆయన తెలిపారు.