గడువులు ముగిస్తున్నా లెక్కలు ఇవ్వని డిస్కంలు
హైద్రాబాద్, జూన్ 27,
రెండేండ్లుగా (2019-20, 2020-21) తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్) ప్రతిపాదనలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)కి సమర్పించ లేదు. డిస్కంలు ఏం చెప్తే... దానికి ఈఆర్సీ తలూపుతూ ఇన్నేండ్లు కాలయాపన చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు 2003 విద్యుత్ చట్టం ప్రకారం ఏఆర్‌ఆర్‌ల దాఖలుకు నిర్ణీత కాలవ్యవధి దాటితే ఈఆర్సీ సుమోటోగా గత సంవత్సరాల ప్రతిపాదనల అధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. డిస్కంలకు ఈఆర్సీ ఇచ్చిన గడువు మే 31తో ముగిసింది. ఇంకా గడువు ఇవ్వాలంటూ డిస్కంలు చేసిన అభ్యర్థనను జూన్ 3వ తేదీ ఈఆర్సీ తిరస్కరించింది. 'త్వరలో' ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. నిర్ణీత తేదీని ప్రకటించలేదు. దీన్నే డిస్కంలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. 15 రోజులైనా, 30 రోజులైనా, 90 రోజులైనా 'త్వరలో' కిందకే వస్తాయంటూ కొత్త భా ష్యం చెప్తున్నాయి.ఆర్థిక క్రమశిక్షణను విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలా ఉల్లంఘిస్తున్నాయో చెప్పడానికి పై సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. రాజకీయ అవసరాలతో అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలమైన సమయంలో ప్రభుత్వపరంగా నిర్ణయాలు తీసుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిస్కంలు తమ స్వయంప్రతిపత్తిని వదిలేసి, ప్రభుత్వాలు ఎలా చెప్తే అలా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటి ఏఆర్‌ఆర్‌లను అప్పుడే దాఖలు చేస్తే, ప్రజలపై ఒకేసారి ఆర్థిక భారాలు పడకుండా ఉంటాయి. కరెంటు చార్జీలు కూడా తగ్గుతాయి. అందుకు భిన్నంగా ఏఆర్‌ఆర్‌ల దాఖలు జాప్యం చేస్తూ, దొడ్డితోవలో డిస్కంలు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తూ, ప్రజలపై పరోక్షంగా భారాలను మోపుతున్నాయి. దానికి లాక్‌డౌన్ పేరుతో ఈనెలలో ఇచ్చిన అధిక కరెంటు బిల్లుల వ్యవహారమే ప్రత్యక్ష ఉదాహరణ. 20 రోజులు గడిచిపోయినా టీఎస్‌ఈఆర్సీ 'త్వరలో' మాట అమల్లోకి రాకపోవడం గమనార్హం!విద్యుత్‌రంగంలో టెక్నాలజీ పెరిగింది. దేశ వ్యాప్తంగా డిమాండ్‌కు మించి ఉత్పత్తి జరుగు తున్నది. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు సమాంత రంగా పనిచేస్తున్నాయి. పవర్ ఎక్సేంజీల్లో అతి తక్కువ ధరకే కరెంటు దొరుకుతున్నది. దేశంలోని అన్ని ప్రాంతాలతో తెలంగాణకు విద్యుత్ కారిడార్ ఉన్నది. అందువల్లే తక్కువ కాలంలోనే రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అమల్లోకి వచ్చింది.మనకు యూనిట్ రేటు క్రమేణా తగ్గుతున్నా దానికి అనుగుణంగా వినియోగదారుల కరెంటు బిల్లులు తగ్గట్లేదు. ఒకవిధంగా చెప్పాలంటే అంతర్జాతీ యంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా, భారత దేశంలో మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరెంటు బిల్లుల పరిస్థితి కూడా అలాగే ఉంది. యూనిట్ రేటు అధికంగా ఉన్నప్పటి చార్జీలే ఇప్పుడూ అమల్లో ఉన్నాయి. డిస్కంలు ఆర్థిక క్రమశిక్షణ తప్పడం వల్లే ప్రజలపై ఆర్థిక భారాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా డిస్కంలు ఏఆర్‌ఆర్‌లను టీఎస్‌ఈఆర్సీకి సమర్పించి, బహిరంగ విచారణ నిర్వహిస్తే, మరిన్ని లోపాలు వెలుగులోకి వస్తాయని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.