YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మిర్చి రైతులకు దారేది...?

మిర్చి రైతులకు  దారేది...?

గుంటూరు: మిర్చిరైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారుతోంది.మిర్చి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. నానా కష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాట ధర లభించడం లేదు. దీంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర పెరగకపోవడంతో పంటను ఎక్కువ కాలం ఇంట్లో పెట్టుకోలేక చివరికి మార్కెట్‌లో ఏదో ఒక రేటుకు అమ్ముకుని ఇంటిబాట పట్టాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. రైతులకు గిట్టుబాట ధర కల్పించడం కోసం రూ.5వేల కోట్లలో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు టిడిపి ప్రభుత్వం హామీ ఇచ్చినా బడ్జెట్‌లో దాని ఊసే లేదు. పంట ఎండిపోయి వదిలేసిన పొలాలెన్నో వున్నాయి. కౌలు రేట్లు, ఎరువులు, పురుగు మందుల ఖర్చు కూడా పెరిగింది. వర్షాభావ పరిస్థితుల వల్ల ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు ఒక్కో రైతు రూ.30 వేలకు పైగా ఖర్చు పెట్టాడు. గిట్టుబాటుధర కోసం నెలరోజులుగా రోడ్డెక్కిన నేపథ్యంలో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లపై దృష్టి సారించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కోల్డుస్టోరేజీల్లో నిల్వలు పేరుకుపోయాయి. మరిన్ని నిల్వలకు కోల్డుస్టోరేజీల యాజమాన్యాలు రైతుల వద్ద నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్నాయి. ఒక్కో టిక్కీకి రూ. 120 రూపాయలు వసూలు చేస్తున్నారు. మూడురోజల పాటు నిల్వ ఉండే విధంగా వీటిని భద్రపరుస్తున్నారు. నిల్వలు భారీగా చేరటంతో కోల్డు స్టోరేజీల యాజమాన్యాలు మరో 20 రూపాయలు మేర ధర పెంచాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుచేసిన మిర్చిని ఏ రకంగా భద్రపరచాలనే విషయమై ప్రభుత్వ వర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే గోడౌన్లలో సరకు పూర్తిస్థాయిలో నిండి ఉంది. కోల్డు స్టోరేజీల్లో మిర్చితో పాటు ఎప్పటి నుంచో పసుపు నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. పసుపు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గత కొద్దినెలలుగా రైతులు కోల్డుస్టోరేజీల్లోనే నిల్వ చేశారు. దీనికితోడు ఇతర వాణిజ్య పంటలు భద్రపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్డు స్టోరేజీలు ఫుల్ అయ్యాయి. వ్యవసాయశాఖ అధీనంలోని గోడౌన్లలో ఖాళీలేదని చెప్తున్నారు. ప్రస్తుతం రైతుల వద్ద నుంచి 12 లక్షల క్వింటాళ్ల మేర మిర్చి కొనుగోలు చేయాల్సి ఉంది. ఒకవేళ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తే గోడౌన్ల కొరత నేపథ్యంలో ఎక్కడ భద్రపరచాలనే విషయమై అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గుంటూరు జిల్లాలోనే ఇప్పటి వరకు 1.5 లక్షల క్వింటాళ్ల కొనుగోలు చేశారు. కోల్డు స్టోరేజీల్లో నిల్వ సామర్థ్యం లేకపోవడంతో మార్కెటింగ్ అధికారులు, ఎఎంసి చైర్మన్ మన్నవ సుబ్బారావు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 70కు పైగా కోల్డు స్టోరేజీల యాజమాన్యాలు వివిధ బ్యాంకుల వద్ద నుంచి సుమారు 40 కోట్ల మేర రుణాలు సేకరించాయి. దీనికితోడు రైతుల వద్ద నుంచి తీసుకున్న అడ్వాన్సులతో నిల్వలకు వీలులేదని చెప్తున్నారు. కాగా గత రెండు నెలల క్రితం కల్తీ కారం నిల్వలను కొన్ని కోల్డు స్టోరేజీల్లో నిల్వచేశారు. సుమారు 15 వేల క్వింటాళ్ల మేరకు నిల్వలను సీజ్‌చేసి వాటిని కోల్డుస్టోరేజీల్లోనే ఉంచారు. వాటిని వేరేచోటకు తరలించడం ద్వారా కొత్తగా మార్క్‌ఫెడ్ కొనుగోలుచేసే మిర్చిని నిల్వచేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. గోడౌన్ల కొరత ఓ రకమైన సమస్య కాగా, రైతులు రవాణా ఖర్చులన్నా మిగులుతాయనే భావనతో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలనే డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. గత ఏడాది గిరాకీ ఉండటంతో విస్తీర్ణం పెంచటం వల్ల అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదికి గట్టెక్కితే వచ్చే సీజన్‌కు ఎలాగోలా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవచ్చనే భావనతో ఉన్నారు

Related Posts