YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

50 శాతానికి మించని ఉపాధి

50 శాతానికి మించని ఉపాధి

 నిరుపేదలకు పని కల్పించడంతోపాటు, గ్రామాల్లో స్థానికంగా ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అభాసుపాలౌతుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం'.. గ్రామీణ పేదలకు స్థానికంగా ఏడాదికి కనీసం 100 రోజులు పనులు కల్పించడం.. వలసలను నివారించడం.. పల్లెల్లో సంపద వృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకం కొంత మందికి కల్పవృక్షంలా మారింది. అక్రమాలకు దారులు తెరిచేశారు. పేదల పేరుతో నిధులు భోజ్యం చేసేశారు. రూ. 10 కూలి పెంచండని వేతనదారులు వేడుకున్నా కనికరించని అధికారులు అక్రమార్కులు రూ. కోట్లు కొల్లగొట్టేసినా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. నాయకుల నుంచి అధికారుల వరకు క్షేత్ర సిబ్బంది నుంచి దళారుల వరకు అందరూ జేబులు నింపేసుకున్నారు. ప్రభుత్వం ఖజానాకు కన్నం పెట్టేశారు.

శ్రీకాకుళం జిల్లా అంటేనే మొదట గుర్తొచ్చేది వలసలు! వలసలను నివారించేందుకు ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద ప్రభుత్వాలు ఏటా రూ.కోట్లు విడుదల చేస్తున్నాయి. స్థానికంగా ఉపాధి పనులు కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని నిర్దేశిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లోని 1100 పంచాయతీల్లోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టేలా లక్ష్యాలను విధిస్తున్నారు. రూ. 2 వేల కోట్ల వరకు విలువైన పనులను గుర్తించి అంచనాలు రూపొందించి ఆమోదిస్తున్నారు. ఏటా రూ. 700 కోట్ల వరకు పనులు జరుగుతున్నాయి. 5,64,062 కుటుంబాలకు జాబ్‌కార్డులు అందించగా, వీటి పరిధిలో 7,45,180 మందికి ఉపాధి పనులు కల్పించాలన్నది లక్ష్యం. ఇందుకు అనుగుణంగానే ఆర్థిక సంవత్సరానికి ముందే ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పథకం అమలులో అక్రమాలు మితిమీరిపోయాయి. దొరికిన వారు దొరికినట్లు దోచేస్తున్నారు. ఏటా ఉపాధి పనులపై నిర్వహిస్తున్న సామాజిక తనిఖీల్లో భారీగా అక్రమాలు బయటపడుతున్నాయి. అక్రమార్కుల నుంచి ఈ నిధులను రికవరీ చేయాల్సిన అధికారులు చేతులెత్తేస్తున్నారు.రెండేళ్లుగా ఉపాధి హామీ పథకం అమలు తీరు నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారవుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 50శాతం కూడా పనులు కల్పించలేని దుస్థితి జిల్లాలో నెలకొంది. మొత్తం 5,59,326మందికి జాబ్‌కార్డు ఉండగా, అంతకుమించి వేతనదారులు ఉన్నారు. ప్రతీ ఏడాది 70 నుండి 80శాతం మధ్య ఈ వేతనదారులు ఉపాధి పనులను వినియోగించుకునే వారు. కానీ రెండేళ్లుగా ఈ శాతం తగ్గుతూ వస్తుంది. ఈ ఏడాది ఇంతవరకు జిల్లావ్యాప్తంగా 2లక్షల మందికి కూడా పనులు కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది పనులు మండలాల్లో ప్రారంభించగా వందరోజుల పనులు పూర్తయ్యేనెపంతో చాలాచోట్ల పనులు కల్పించలేదు. గ్రామాల్లో పనులు చేపట్టేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించడంతో కూలీలకు పనిలేకుండా పోతుంది. గతంలో కూలీల కడుపులను నింపిన ఈ పథకం ఇప్పుడు వారికి ఆకలిమంటల్లోకి నెట్టేస్తుంది. పనులు చేపట్టిన చోట్ల కూడా కూలీలకు కనీస వసతులు లేకుండా పోవడంతో వేసవి ఎండల దృష్ట్యావారంతా సతమతం అవుతున్నారు. ఇటువంటి దుస్థితిలో కూలీలు స్థానికంగా ఉపాధి దొరక్క పొట్టకూటికోసం వలసల బాట పడుతున్నారు. ఇందుకు శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలుతీరే నిదర్శనంగా నిలుస్తుంది. జిల్లాలో ఉపాధి హామీ పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. జన్మభూమి కమిటీల అత్యుత్సాహంతో కొందరికి పనులు దక్కుతుండగా, మరికొందరికి పనులు అక్కరకురాని పరిస్థితులు. వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా శ్రీకాకుళం జిల్లా మారింది. అటువంటి జిల్లాలో వలసల నివారణకు చర్యలు చేపడతామన్న అధికారులు, పాలకులు హామీలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. కనీసం ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కూడా అధికారులు విఫలం కావడంతో పరిస్థితుల్లో మార్పులేకుండా పోయింది. జిల్లాలో ఏడాది కరువుఛాయలు అలముకోవడంతో అనేక మండలాల పరిధిలో కూలీలకు పనులు లేకుండా పోయింది. వారందరినీ ఆదుకోవాల్సిన ఉపాధి హామీ పథకం ఆశించిన రీతిలో అక్కరకు రాకపోవడంతో కూలి పనుల కోసం జిల్లా వాసులు వలసబాట పడుతూనే ఉన్నారు.  గత ఏడాది వందరోజులు పనిదినాలు దాటిన వారికి 150 రోజులు పనులు కల్పిస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ విధానాన్ని మంగళం పాడేసేలా ఉన్నారు. దీంతో పనులు లేక జిల్లాలోని అనేక పంచాయతీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు జరుగుతున్న చోట్ల కూడా కూలీలకు కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడంతో వారంతా పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామీణ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ జీవనోపాధులు బలోపేతం చేయడానికి తగిన ఆస్తులు సృష్టించడం భాగస్వామ్యం స్థానిక సుపరిపాలన వ్యవస్థను పటిష్టం చేయడం ప్రధాన అంశాలుగా ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నారు. ఈ పనుల్లో పాల్గొనే ప్రతీ కుటుంబానికి వందరోజులు పనిదినాలు కల్పించడంతోపాటు గిట్టుబాటు వేతనం అందజేయాల్సి ఉంది. వాస్తవంగా పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో ఉపాధి ఎండ మావిగా మారుతుంది. జిల్లాలో ఈ సీజన్‌లో ఆమదాలవలస, భామిని, బూర్జ, ఎచ్చెర్ల, హిరమండలం, ఇచ్ఛాపురం, జలుమూరు, కంచిలి, కవిటి, మందస, సోంపేట, వజ్రపుకొత్తూరు, వంగర, పాతపట్నం మండలాల పరిధిలోని పలు పంచాయతీల్లో ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. సుమారు 154వరకు అటువంటి పంచాయతీలు ఉన్నాయి. ఈ ఏడాది పనులు ప్రారంభించిన పలు గ్రామాల్లో పనులు కోరినా అధికారులు ఇవ్వడం లేదు. జిల్లా వ్యాప్తంగా 400కుపైగా ఫీల్డ్‌అసిస్టెంట్‌పోస్టులు ఖాళీగా ఉండగా వారి స్థానంలో ఏర్పాటు చేసిన సీనియర్ మేట్లు అధికారులకు వత్తాసు పలుకుతున్నారు. 

Related Posts