YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

పివీకి ‘వంద‘నం

పివీకి ‘వంద‘నం

పివీకి ‘వంద‘నం
(ఇవాళ పీవీ నరసింహారావు శత జయంతి)
తెలంగాణవాడి సత్వాన్ని, తత్తాన్ని..తెలంగాణవాడి కలాన్ని, బలాన్ని..తెలంగాణవాడి జానపదాన్ని, జ్ఞానపథాన్నితెలంగాణా జాతి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో, హరితకేతనం ఎగురవేస్తూ చాటిచెప్పిన తెలంగాణ తేజోమూర్తి పీవీ. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ ఠీవి మన పీవీ. ప్రపంచీకరణను ఈ దేశం మట్టి మీదరాసి చూస్తున్నప్పుడు పి.వి.ని భిన్నకోణాల్లో విశ్లేషించారు. ఈనాడున్న గ్లోబల్ విలేజ్‌ని ఆయన ముప్పయేళ్ల కిత్రం వూహించటం ఆయన దూరదృష్టికి చిహ్నం. నాయకుడంటే అప్పటికప్పుడు తక్షణ సమస్యలపై ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నప్పటికినీ తానువేసే అడుగులు రాబోయే కొన్నేళ్ల తర్వాత కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రపంచం అంతా ఒక కుగ్రామం అన్న ఇప్పటి ఆలోచనను పి.వి. ఎప్పుడో వూహించాడు. అది పి.వి కున్న ప్రాపంచిక దృష్టి. అందుకోలేనంత సామాజిక రాజకీయ దివ్యదృష్టి ఆయనలో ఉంది.పీవీ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. అందులో ప్రతి పుట సమకాలీన సామాజిక సంవేదనలను, రాజకీయాల వ్యూహ ప్రతివ్యూహాలను, సాంస్కృతిక సారస్వత కళా విలసనాలను ప్రతిఫలిస్తుంది. సామాన్యుడు మొదలు మాన్యుని వరకు మానవుని రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు, భావోద్వేగాలు, నిర్లిప్త వైరాగ్యాలు, జయాపజయాలను తెలియజేస్తుంది.పీవీ రాజకీయ ప్రస్థానం 1952 జనరల్‌ ఎలక్షన్లతో మొదలైంది. దశాబ్దకాలానికి ఊపందుకున్నది. అలా 1962లో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో తొలిసారి న్యాయశాఖ, జైళ్లు, సమాచారశాఖ మంత్రిగా చేరి తన సంస్కరణల పర్వానికి తెరదీశారు. ఖైదీల సంక్షేమం కోసం పలు సంక్షేమ చర్యలు తీసుకున్నారు. తదుపరి దేవాదాయ శాఖ (1964-67), వైద్య ఆరోగ్య శాఖ, విద్యామంత్రిత్వ శాఖలను సమర్థంగా నిర్వహించారు. పీయూసీకి బదులు మళ్లీ ఇంటర్మీడియట్‌ను తెలుగు మీడియంతో ప్రవేశపెట్టడమే కాదు, తెలుగు అకాడమికి రూపకల్పన చేసింది కూడా పీవీయే.1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టోద్యమ సెగవల్ల కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, 1971లో పీవీ ముఖ్యమంత్రిగా నియుక్తులయ్యారు. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో పీవీ భారీ మెజారిటీ సాధించి భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టి విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అయితే తెలంగాణలోని భూస్వాములకు పీవీ సంస్కరణలు నచ్చక, ఆయనకు వ్యతిరేకంగా కేంద్రంలో హై కమాండ్‌ను కలిసి, పీవీ వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని ప్రచారం చేశారు.  పీవీ తెరవెనుక జరిగే కుట్రను గమనించి, వెంటనే ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో మీటింగ్‌ నిర్వహించి భూసంస్కరణల వల్ల పార్టీకి ఎలా మేలు జరుగుతుందో వివరించారు. అది కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న అంశమని, తను కొత్తగా తయారుచేసింది కాదని, పైగా మోహన్‌లాల్‌ సుఖాడియా 1960ల్లోనే ముఖ్యమంత్రిగా రాజస్థాన్‌లో భూ సంస్కరణలు విజయవంతంగా అమలుచేశారని సోదాహరణంగా ప్రసంగించి ఇందిరాగాంధీని మెప్పించారు. 1962లో జరిగిన యుద్ధం వల్ల భారత్‌- చైనా సంబంధాలు క్షీణించాయి. మళ్ళీ 30 ఏండ్ల అనంతరం పీవీ చొరవ తీసుకొని చైనా ప్రధాని లీపెంగ్‌ను భారత్‌కు ఆహ్వానించారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. అలాగే పాలస్తీనా సమస్య విషయంలో రాజనీతిని ప్రదర్శించారు. పాలస్తీనా నాయకుడు యాసర్‌ అరాఫత్‌తో చర్చిస్తూనే, ఇజ్రాయెల్‌ దేశంతో దౌత్య సంబంధాలను కొనసాగించడాన్ని పలు దేశాలు ప్రశంసించాయి.  1992 డిసెంబర్‌ ఆరవ తేదీన అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను.. పీవీని రాజకీయంగా దూరం చేయడానికి కొందరు అవకాశంగా వాడుకోవాలనుకున్నారు. నట్వర్‌సింగ్‌, అర్జున్‌సింగ్‌, ఎన్డీ తివారీ ప్రభృతులు తీవ్ర ప్రయత్నమే చేసి గలాభా సృష్టించారు. పీవీతో రాజీనామా చేయించడానికి వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తానికి ఐదేండ్ల కాలంలో పీవీ దేశానికి సుస్థిర ప్రభుత్వాన్ని, పాలనను ఇచ్చారు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేశారు.1970లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లుతాయని ఇచ్చిన తీర్పును, 1972 ఫిబ్రవరి 4న హైకోర్టు ధర్మాసనం రద్దు చేయటంతో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం మొదలైంది. అది రాను రాను పీవీ వ్యతిరేక ఉద్యమంగా మారటంతో 1973 జనవరి 17న పీవీ ప్రభుత్వం రాజీనామా చేసింది. దాంతో పీవీ శకం ముగిసిందని, పీవీ వ్యతిరేక వర్గం సంతోషించింది. భూ సంస్కరణల చట్టం తెచ్చి పీవీ ముఖ్యమంత్రిగా విఫలమయ్యాడని చాలామంది ప్రచారం చేశారు.  ఆంధ్రోద్యమం వల్లనే పీవీ రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం రాష్ట్రపతి పాలనే విధించారుగానీ పీవీ బదులు వేరే ముఖ్యమంత్రిని నియమించలేదు. కాని వారి సంతోషం ఎంతో కాలం నిలువలేదు. పీవీ వంటి మేధావి సేవలు రాష్ట్రస్థాయి కన్న అఖిల భారత స్థాయిలోనే అవసరమని భావించి, ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి తెలంగాణ నుంచి ఎంపికైన తొలి ముఖ్యమంత్రి గానే కాదు, తెలుగు జాతి అంతా సగర్వంగా చెప్పుకునేలా దక్షిణ భారతదేశం నుంచే ప్రధాని పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి వ్యక్తిగా పీవీ ప్రత్యేక గౌరవం పొందారు. ఒక్క రాజకీయ రంగమే కాదు, సాహిత్యంలోనూ వారి సృజన ఎంతో ఎన్నదగింది. కవిగా, కథకునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాద రచయితగా, విమర్శకునిగా వారిది విశ్వరూపమే.  పద్దెనిమిది భాషలలోనూ వారు నిష్ణాతులు. వారికి అర్థశాస్త్రంలో ఎంత పట్టుందో, ఆధ్యాత్మిక విషయాలలోనూ అంతే పట్టుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ శతాబ్ది దేశ చరిత్రలో ఇంతటి విశిష్ట విలక్షణ, బహుముఖ ప్రతిభాశాలి  పీవీ ఒక్కరే. పీవీ తెలంగాణా దొరల కుటుంబంలో జన్మించారు. కానీ ‘దొరతనం’తో ఎదగలేదు. తండ్రి ఒడిలో నేర్చుకున్న భాగవత పద్యాల వలన ప్రహ్లాదుని వలె వినయవిధేయతలతో చదువుల సారం అంతా ఎరిగి పెరిగాడు. ఆయన రాజ ఠీవికి కారణం.. పలు భాష, బహు శాస్ర్తాల విజ్ఞానమే కాని, ‘దొరతనం’ కాదు. రెండు ప్రపంచ యుద్ధాల సంధికాలంలో పీవీ బాల్యం, ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం గడిచింది. 1930-35 మధ్యకాలంలో దేశంలో సంభవించిన పరిణామాలు ఎంతో ప్రభావితం చేశాయి. గార్లపాటి రాఘవరెడ్డి శిష్యరికంలో సంస్కృతాంధ్ర సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేశారు. ఉర్దూ మీడియంలో చదవటం మూలాన ఆ భాష సాహితీ సౌందర్యాన్ని ఆస్వాదించారు. ఆంగ్ల సాహిత్యాన్ని క్షుణ్నంగా చదువడమే కాదు, షేక్స్‌పియర్‌ నాటకాలను తెలుగులోకి అనువదించారు. థామస్‌ గ్రే ‘ఎలిజి’ని అనుసృజించారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస, వక్తృత్వ, కవిత్వ, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల పోటీలన్నింటిలో ప్రథమ విజేతగా నిలిచారు. మెట్రిక్యులేషన్‌ పరీక్షలో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి, ప్రిన్సిపాల్‌తో ఆదర్శ విద్యార్థి అని ప్రశంసలు అందుకున్నారు. మెట్రిక్‌ పాస్‌ సర్టిఫికెటు, బంగారు పతకాన్ని పీవీకి బహూకరిస్తూ.. నాటి విద్యాశాఖాధికారి ప్రశంసిస్తూనే.. ‘నిజాం ప్రభువుకు విధేయునిగా ఉంటేనే మనగలుగుతావు’ అని మంద్ర         స్వరంలో కఠినంగా పలకడంతో పీవీలో.. ‘ఎందుకు విధేయంగా ఉండాలి’? అనే తిరుగుబాటు తత్వానికి బీజం పడింది. ఇంటర్‌లో చేరిన పీవీని ఆర్యసమాజ్‌ సిద్ధాంతాలు ఆకర్షించాయి. భారతీయుల సమైక్యత కోసం తిలక్‌ నిర్వహించిన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు స్ఫూర్తినిచ్చాయి. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకించాలంటే ప్రజలంతా ఒకటి కావాలి. అందుకని పీవీ ‘భజనమండలి’ని ఏర్పాటుచేసి, తనతోటి విద్యార్థులను సమావేశపరిచి వీరావేశంతో ప్రసంగించి ఉత్తేజ               పరిచేవాడు. పీవీ భావోద్వేగానికి ‘వందేమాతరం’ ఒక తారకమంత్రంగా ఉపకరించింది. ఉద్యమాల్ని తీవ్రతరం చేసి కాలేజీ నుంచి బహిష్కృతుడయ్యారు. దేశంలో ఏ యూనివర్సిటీ సీటు ఇవ్వకూడదని పీవీ తదితర విద్యార్థుల టీసీలపై నోట్‌ రాసి రాజముద్ర వేసింది నిజాం ప్రభుత్వం. ఆ పరిస్థితుల్లో.. నాగపూర్‌ యూనివర్సిటీ పీవీతోపాటు 30మంది విద్యార్థులకు, ఇంటర్‌లో ప్రవేశం కల్పించింది. నాగపూర్‌లోని రాజకీయ, సాంస్కృతిక వాతావరణం పీవీని ఆకట్టుకున్నది. ఒకవైపు ఇంటర్‌ విద్యార్థిగా ఉంటూనే మరాఠి భాషను నేర్చుకొని అనతికాలంలోనే మరాఠిలో అనర్గళంగా ప్రసంగించే స్థాయికి చేరుకున్నారు. 1939లో త్రిపుర కాంగ్రెస్‌ సభలకు హాజరైన పీవీ అక్కడ పలు జాతీయ నాయకుల ప్రసంగాలు విని ఎంతో ఉత్తేజితులయ్యారు. పీవీ ఇంటర్‌ యూనివర్సిటీ ఫస్ట్‌గా నిలిచారు. ఆయనకు గణిత శాస్త్రమంటే ఇష్టంగా ఉండేది. పూనాలోని ఫర్గూసన్‌ కళాశాలలో బీ ఎస్సీ మ్యాథ్స్‌లో చేరారు. గోపాల కృష్ణ గోఖలె ప్రభృతుల ఉపన్యాసాలు, మహారాష్ట్రలో వీరసావర్కర్‌ ప్రబోధాలు అక్కడి సంస్కృతి పీవీ జీవిత లక్ష్యాన్ని స్వాతంత్య్రోద్యమం వైపు మరల్చాయి. ఆ సమయంలో మరాఠి కన్నడ భాషల్లో పట్టుసాధించిన పీవీ హరినారాయణ్‌ ఆప్టె రచనలు, సంత్‌ తుకారాం అభంగాలు చదివి అనువాదాలకు ఉపక్రమించారు. బీఎస్సీ యూనివర్సిటీ ఫస్ట్‌గా నిలిచిన పీవీ నాగపూర్‌ యూనివర్సిటీలో లా చదివి, న్యాయవిద్యలోనూ సర్వోన్నత శ్రేణి సాధించారు. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం పీవీ ప్రతిభను ప్రశంసించి, జుడిషియల్‌ సర్వీస్‌లో చేరాలని ఆహ్వానించగా తిరస్కరించి, హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభల నిర్మాతలలో ప్రముఖంగా పేర్కొనదగిన బూర్గుల రామకృష్ణారావు వ్యక్తిత్వం పీవీని ఆకర్షించింది. ఆయన వద్ద జూనియర్‌గా చేరి న్యాయవాద వృత్తిని కొంతకాలం కొనసాగించారు. అయితే దేశానికి స్వాతంత్య్రం లభించినప్పటికీ నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రం (నాడు హైదరాబాద్‌ స్టేట్‌) విముక్తం కాకపోవటం పీవీని కలచివేసింది. స్వామి రామానంద తీర్థ పిలుపునందుకొని వకాలత్‌ వృత్తికి స్వస్తి చెప్పి హైదరాబాద్‌ రాష్ట్ర స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. 1946లో హైదరాబాద్‌ స్టేట్‌ భారత యూనియన్‌లో విలీనమయ్యాక, పీవీ తన సన్నిహిత మిత్రుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి ‘కాకతీయ’ వారపత్రికను నిర్వహించి సమకాలీన రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలకు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలను, విమర్శలను వెలువరించారు. గొల్ల రామవ్వ మొదలైన కథలు రాసి తనలోని రచయితను ఎరుకపరిచారు. 

Related Posts