విశాఖపట్టణం: పర్యావరణంగా పలు సమస్యలకు మూలమైన భవన నిర్మాణ వ్యర్థాలను పునర్వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పర్యావరణ సమస్యలకు కీలకమైన భవని నిర్మాణ, భవన వ్యర్థాలను పునర్వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం 2016లో కనస్ట్రక్షన్ అండ్ డిమాలిషింగ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ పేరిట చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలో నిబంధనల మేరకు ప్రభుత్వ నిర్మాణాల్లో 10 నుంచి 20 శాతం వ్యర్థాలతో తయారు చేసిన సామాగ్రిని ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకు వీలుగా 10 లక్షలు పైబడి జనాభా కలిగిన పట్టణాల్లో 16 నెలల కాల వ్యవధిలోను, 10 లక్షల లోపు జనాభా కలిగిన పట్టణాల్లో రెండేళ్ల కాల వ్యవధిలోను ప్లాంట్‌ల నిర్మాణం చేపట్టాల్సి ఉందికనస్ట్రక్షన్ అండ్ డిమాలిషింగ్ వ్యర్థాలను పునర్వినియోగించుకోవడం ద్వారా పర్యావరణ ఇబ్బందులకు చెక్ చెప్పాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలమైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కేంద్రాలుగా మూడు ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు అవసమైన కసరత్తు పూర్తయింది. . ప్రస్తుతం అహ్మదాబాద్, ఢిల్లీ పట్టణాల్లో మాత్రమే సి అండ్ డి వేస్ట్ ప్లాంట్‌లు ఉన్నాయి. వీటిని అన్ని పట్టణాలకు విస్తరించడం ద్వారా సిఅండ్‌డి ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖ, తిరుపతి, విజయవాడల్లో ప్లాంట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే విశాఖ కాపులుప్పాడలో దీనికోసం స్థలం కేటాయించారు. ఈ ఏడాది చివరి నాటికి ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు