కర్తర్ పూర్ కారిడార్.. ప్రారంభం
న్యూఢిల్లీ, జూన్ 27,
మహారాజా రంజిత్ సింగ్ వర్దంతిని పురస్కరించుకుని జూన్ 29 నుంచి రెండు రోజుల పాటు కర్తాపూర్ కారిడార్‌ను తెరనున్నట్టు పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనను భారత్ తోసిపుచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా కర్తాపూర్ కారిడార్‌ను తాత్కాలికంగా పాకిస్థాన్ మూసివేసిన విషయం తెలిసిందే. మహారాజా రంజిత్ సింగ్ వర్దంతికి సద్భావనగా కారిడార్‌ను రెండు రోజులు తెరుస్తామన్న పాక్ ప్రకటనను ప్రభుత్వ వర్గాలు ఎండమావిగా అభివర్ణించాయి. ఇది ద్వైపాక్షిక ఒప్పందాన్ని బలహీనపరుస్తుందని, ప్రయాణ తేదీకి వారం ముందు ఈ విషయాన్ని వెల్లడిచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాయి.ఒకవేళ పాకిస్థాన్ చెప్పినట్టు కర్తాపూర్ కారిడార్‌ను సద్భావనతో తెరుస్తున్నామన్నా కనీసం ఏడు రోజుల ముందుగానే తెలియజేయాలి.. ప్రయాణానికి వారం రోజుల ముందు యాత్రికుల పేర్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. అంతేకాదు, ద్వైపాక్షిక ఒప్పందానికి కట్టుబడి ఉన్నప్పటికీ, రావి నదిపై వంతెనను పాకిస్తాన్ నిర్మించలేదు. ‘రుతుపవనాల ఆగమనంతో కారిడార్ ద్వారా యాత్రికులు సురక్షితంగా చేరుకోవడం సాధ్యమేనా అని అంచనా వేయాలి అని పేర్కొన్నాయి.మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి సందర్బంగా కార్తాపూర్ కారిడార్‌ను రెండు రోజుల పాటు తెరవనున్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహమూద్ ఖురేషి శనివారం ప్రకటించారు. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు తెరవడంతో, సిక్కు యాత్రికుల కోసం కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తిరిగి తెరవడానికి పాకిస్థాన్ సిద్ధమవుతోంది, మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి సందర్భంగా 2020 జూన్ 29 న కారిడార్‌ను తిరిగి తెరవడానికి సంసిద్ధతను భారత్‌కు తెలియజేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.సిక్కులతో ముడిపడి ఉన్న కారణంగా కార్తాపూర్ కారిడార్ ప్రాముఖ్యత వల్ల ఇరు దేశాల మధ్య శత్రుత్వం దీనిపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, పాక్ దౌత్య సిబ్బంది గూఢచర్యానికి పాల్పడటంతో వారిని భారత్ అదుపులోకి తీసుకుని బహిష్కరించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. దీనికి ప్రతీకారంగా ఇస్లామాబాద్‌లోని భారతీయ అధికారులను బెదిరించడం, సిబ్బందిని కూడా కిడ్నాప్ చేశారు. 2001 తరువాత మొదటిసారిగా హైకమిషన్ సిబ్బందిని సగానికి తగ్గించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.