కశ్మీర్ లో పట్టుబడ్డ ఉగ్రవాదులు
శ్రీనగర్, జూన్ 28
జమ్మూ కశ్మీర్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కుప్వారాలో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.65 కోట్ల విలువైన మత్తుపదార్థాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న సైన్యం.. వారి వద్ద నుంచి 13.5 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్‌లో వీటి విలువ రూ.65 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను బరాముల్లా జిల్లాలోని బిజ్‌హమా, లచీపోర్‌కు చెందిన మంజూన్ అహ్మద్ లోనే, గౌస్ మహ్మద్ లోనేగా గుర్తించారు. వీరి వద్ద రెండు తుపాకులు, నాలుగు మ్యాగజైన్లు, 55 లైవ్ రౌండ్లు, నాలుగు హ్యాండ్ గ్రనేడ్లు, 10 డిటోనేటర్లు లభ్యమైనట్టు వివరించారు.‘ఈ ఇద్దరూ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.. కశ్మీర్ లోయలోని ఉగ్రవాదులకు మాదకద్రవ్యాల విక్రయం, ఆయుధాల సరఫరా చేస్తున్నారు’ అని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీరిని ఉగ్రవాదులుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇద్దరిపై కర్లాపొర పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణ కొనసాగుతుందని, దర్యాప్తులో వాస్తవాలు వెల్లడవుతాయని తెలిపారు. పూంచ్ సెక్టార్‌లోనూ 1.5 కిలోల హెరాయిన్ భద్రతా దళాలకు పట్టుబడింది. పూంచ్ సెక్టార్‌లోని మెంధార్ సమీపంలో నియంత్రణ రేఖ వద్ద ఓ గ్రామంలో హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దబ్బీ అటవీ ప్రాంతంలో మెంధార్ పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా.. ఓ అనుమానితుడి నుంచి మూడు ప్యాకెట్లలో ఉన్న హెరాయిన్ పట్టుబడిందని, దీనిపై పాకిస్థాన్‌లోని లాహోర్ చిరునామా ఉందని తెలిపారు.