YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎంపీలు...మాట దాటుతున్నారా...

ఎంపీలు...మాట దాటుతున్నారా...

ఎంపీలు...మాట దాటుతున్నారా...
హైద్రాబాద్, జూన్ 29,
వైసీపీ ఎంపీలు 22 మంది గెలిచారు అని సంబరపడినంత సేపు పట్టలేదు. గెలిచిన నెల రోజుల వ్యవధిలోనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని దర్శించుకుని వచ్చారు. ఆ తరువాత ఆయనకు అతి కీలకమైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. చిత్రమేంటంటే ఆయన్ని ఆ పదవిలో నియమిస్తున్నట్లుగా కనీసం ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా తెలియదు. ఇది సన్నని మంటగా మొదలై ఇపుడు రాజు గారు వైసీపీ నుంచి షోకాజ్ నోటీస్ అందుకునే దాకా వచ్చేశారు. ఈ ఏడాదిలో ఒకసారి మాత్రమే రాజు గారు జగన్ తో సమావేశం అయ్యారు. నాడు ఇద్దరి మధ్యన ఏం మాటలు, మంతనాలు జరిగాయో తెలియదు కానీ మళ్ళీ గత ఆరు నెలలుగా రాజు గారు రాగాలు, దీర్ఘాలు జగన్ కి వ్యతిరేకంగా అందుకున్నారు.ఇక రాజమండ్రీ ఎంపీగా యువకుడు, బీసీ వర్గానికి చెందిన మార్గాన భరత్ ని జగన్ ఏరీ కోరి తెచ్చి నిలబెట్టి ఎంపీని చేశారు. ఆయన అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేశారట. ఇక ఆయన తండ్రి మార్గాన నాగేశ్వరరావు ప్రముఖ బీసీ నాయకుడు. ఆ విధంగా బీసీ ఓటుతో అక్కడ సీటు జగన్ గెలుచుకున్నారు. గెలిచిన దగ్గర నుంచి భరత్ సొంతంగానే ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు. పార్టీలో మిగిలిన నాయకులను కలుపుకుని పోవడంలేదని అంటున్నారు. ఇక ఆయనకూ మరో నేత జక్కంపూడి రాజాకు అసలు పడడంలేదు. ఇక ఇటీవల జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన్ని పిలవకపోవడంతో పార్టీలోని వ్యవహారాలు రచ్చకెక్కాయి. దానికి తోడు భరత్ మీద వైసీపీ నుంచే ఆరోపణలు ఉన్నాయి. ఆవ భూముల స్కామ్ విషయంలో ఆయన పాత్ర ఉందని అంటున్నారు. ఆ భూములను బినామీ పేరిట తీసుకుని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇళ్ల పట్టాలకు విక్రయించారని కూడా ప్రచారం సాగుతోంది. ఇది జగన్ కి కూడా తెలిసి ఆయన్ని దూరం పెట్టారని కూడా అంటున్నారు. ఇపుడు రాజమండ్రీ మాజీ ఎంపీ ఉండాల్లి అరుణ్ కుమార్ కూడా ఆవ భూములకు ఎకరం 45 లక్షలు పెట్టి కొనుగోలు చేయడమేంటి అని నిలదీస్తూ జగన్ కి లేఖ రాశారు. ఈ వ్యవహారం ముదిరి జగన్ విచారణకు ఆదేశిస్తే ఇరుక్కునేది ఎంపీగారేనని అంటున్నారు.
ఇక విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీద కూడా జగన్ గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఆయన మొదట సినీ నిర్మాత. బిల్డర్, ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇలా వచ్చి అలా ఎంపీ అయిపోయిన ఎంవీవీ పార్టీకి పెద్దగా ఉపయోగపడడంలేదని విమర్శలు ఉన్నాయి. ఇక ఆయన ప్రభుత్వ ఇసుక పాలసీని తనకు అనుకూలంగా వాడుకుని బిల్డర్ గా తన నిర్మాణ ప్రాజెక్టులకు ఇసుకను పెద్ద ఎత్తున అక్రమ బాటలో వాడుకుంటున్నారని పార్టీలో ఆరోపణలు ఉన్నాయి. ఈ సంగతి కూడా జగన్ చెవిన పడడంతో ఆయన ఎంపీ గారికి ఈ మధ్యనే అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని, జగన్ ఆయన్ని కూడా దూరం పెట్టారని అంటున్నారు. ఈ విధంగా చూసుకుంటే అపుడే కొంతమంది ఎంపీలు తోక జాడిస్తున్న దాఖలాలు బయటపడుతున్నాయి. మరి జగన్ వీరికి షాక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి దగ్గర చేసుకుంటారా. దూరం పెట్టుకుంటారా అన్నది చూడాలి.

Related Posts