పీఓకేలో ఎన్నికలకు దాయాది దేశం అడుగులు
లాహార్, జూన్ 29
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఎన్నికల నిర్వహణపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా దాయాది మాత్రం వెనక్కుతగ్గడంలేదు. భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ పీఓకేలో ఎన్నికలు నిర్వహణకు పాక్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. గిల్గిత్-బాల్టిస్థాన్ శాసనసభ ఎన్నికలు ఆగస్టు 18న నిర్వహించనున్నట్టు దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వీటిని జరపనున్నట్టు అందులో పేర్కొన్నారు. మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్టు తెలిపారు.ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, పాక్ ఎన్నికల చట్టం 2017ను గిల్గిత్-బాల్టిస్థాన్‌లో పొడిగించాలని అధ్యక్షుడు అల్వి గత నెలలో ఆదేశించారు. జూన్ 24తో గిల్గిత్-బాల్టిస్థాన్ శాసనసభ కాలపరిమితి ముగయడంతో.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాజీ డీఐజీ మీర్ అఫ్జల్‌ను నియమించారు.గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో సాధారణ ఎన్నికల నిర్వహణకు పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఏప్రిల్ 30న అనుమతి ఇచ్చింది. అయితే, ఈ ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో అంతర్భాగమని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తచేసింది. గిల్గిత్-బాల్టిస్థాన్ సహా జమ్మూ కశ్మీర్, లడఖ్ మొత్తం భారత్‌లో అంతర్భాగమని, ఆక్రమించుకున్న భూభాగం నుంచి తక్షణమే వైదొలగాలని పాకిస్థాన్‌కు అల్టిమేటం జారీచేసింది. గిల్గిత్-బాల్టిస్థాన్‌లో సాధారణ ఎన్నికల నిర్వహణకు అక్కడ ప్రభుత్వం 2018లో చేసిన సవరణకు పాక్ సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్.. ఆ ప్రాంతం కూడా తమదేనని స్పష్టం చేసింది.గిల్గిత్- బాల్టిస్థాన్ ప్రాంతం సహా జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ఒక అంతర్భాగం.. దీనిపై పూర్తిస్థాయి చట్టబద్ధమైన అధికారులు తమవేనని స్పష్టం చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి, దాని న్యాయవ్యవస్థకు చట్టవిరుద్ధమైన, బలవంతంగా ఆక్రమించుకునన భూభాగాలపై ఎలాంటి అధికారం లేదని విదేశాంగ శాఖ ఉద్ఘాటించింది.ఇలాంటి చర్యలను భారత్ పూర్తిగా తిరస్కరిస్తుందని, జమ్మూ కశ్మీర్ భూభాగంలోని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో భౌతిక మార్పులకు నిరంతరం పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోందని మండిపడింది. కాబట్టి, తమ భూభాగం నుంచి పాకిస్థాన్ తక్షణమే వైదొలగాలని హెచ్చరించింది. గత ఏడు దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని ఆక్రమించుకున్న భూభాగాలలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, దోపిడీ, స్వేచ్ఛ హరించే చర్యలకు పాల్పడుతోందని, వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఉగ్రవాదులను ఉసిగొల్పుతోందని భారత్ దుయ్యబట్టింది.