ఆర్మూర్ లో చమురు కోసం అన్వేషణ
నిజామాబాద్, జూన్ 29,
కామారెడ్డి జిల్లాలో సహజవాయువు, చమురు నిక్షేపాల కోసం అన్వేషణ మొదలైంది. అనే్వషణ సత్ఫాలితాలు ఇస్తే మాత్రం జిల్లా రూపురేఖలే మారిపోయే అవకాశాలుంటాయి. కామారెడ్డి జిల్లాలోని పిట్లం, మండలం చిన్నకొడప్‌గల్ ప్రాంతం వరకు చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం అనే్వషణ జోరుగా సాగుతోంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ఆధ్వర్యంలో ఈ బృహత్తర ప్రక్రియ మొదలైంది. ఉపగ్రహాల అధ్యయనం, నిపుణుల విశ్లేషణలతో కామారెడ్డి, నిజామాబాద్ నుండి జహీరాబాద్ వరకు చమురు, సహజవాయువునిక్షేపాలు ఎక్కడైనా కొన్ని చోట్ల లభ్యం అయ్యే అవకాశాలు ఉండవచ్చన్న అంచనాకు వచ్చినట్టు సమాచారం. దాని లభ్యత ఎంత అనేది తేల్చేందుకు ప్రస్తుతం భూగర్భాన్ని శోధిస్తున్నారు. ఉపగ్రహాల సహకారంతో నిక్షేపాల నిల్వలు గుర్తించిన ప్రాంతాలో క్రమపద్ధతిన 2డి సైస్మిక్ సర్వే సాగుతోంది. నిర్ణీత ప్రదేశాల్లో ప్రతి 60 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 80 నుండి 100 ఫీట్ల లోతున రిగ్గు యంత్రాల సహకారంతో భూమిలోకి రంధ్రాలు చేస్తున్నారు. పిట్లం మండలం చిన్నకొడప్‌గల్ శివారులో రెండు మూడు రోజుల క్రితం చమురు అనే్వషణ సాగిస్తున్నట్టు ఓఎన్‌జీసీ ప్రాజెక్ట్ మేనేజర్ రవికుమార్, ఫీల్డ్ ఇన్‌చార్జి రామకృష్ణ, ఫీల్డ్ డ్రిల్లింగ్ సూపర్‌వైజర్ వరుణ తెలిపారు. భూమికి చేసిన రంధ్రాలలో తరంగాలను పసిగట్ట్టేందుకు మ్యాగ్నటిక్ సెన్సార్లు అమరుస్తారని, వాటికి నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా బ్యాటరీలు ఏర్పాటు చేస్తారని, మ్యాగ్నటిక్ సెన్సార్ల నుండి వెలువడే సంకేతాలు గ్రహించేందుకు ప్రత్యేక యాంటీనాలతో కూడిన వాహనం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ వాహనాన్ని మొబైల్ రికార్డర్ పాయింట్‌గా పిలుస్తారు. మాగ్నాటిక్ సెన్సార్ల ద్వారా వెలువడే సాంకేతాలు యాంటీనాల ద్వారా రికార్డర్ పాయింట్ వాహనంలోని కంప్యూటర్‌లకు చేరుతాయి. ఆ కంప్యూటర్లు భూగర్భం నుంచి వచ్చిన తరంగాలను తెరపై తరంగ చిత్రరూపంలో చూపిస్తాయని వెల్లడించారు.తద్వారా ఏ ఎ ప్రాంతాలలో భూమికి ఎలాంటి కదలికలు ఉన్నాయన్నది తెలుస్తుందని, భూమిలో ఖనిజాలు తీరు తెన్నులను బట్టి తరంగాల తీవ్రతతో మార్పులుంటాయని, 2డి సిస్మిక్ సర్వేలో ఆ వివరాలు పసిగట్టి వివరాలు, నమునాలు, ప్రయోగశాలలకు పంపిస్తారని, అక్కడ మరింత లోతు అధ్యయనం చేసి ఏయే ఖనిజాలు ఉన్నాయో నిగ్గు తేలుస్తారని అన్నారు. చమురు, వాయు నిక్షేపాలు, ఉన్నట్టు తేలితే 3డి సర్వే చేపడ్తారని, పిట్లం ప్రాంతంలో చమురు, వాయు నిక్షేపాలు బయటపడితే జిల్లా రూపురేఖలే మారిపోయే అవకాశాలు లేక పోలేదు. ఇంతే కాకుండా వందలాది మందికి ఉపాధి కూడా లభ్యం అయ్యే అవకాశాలుంటాయి.