ఉపాధ్యాయులు పొట్టకూటి కోసం తిప్పలు పడుతున్నారు
- విజయశాంతి
హైదరాబాద్ జూన్ 29
కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో పాఠశాలలను ఇప్పట్లో తెరిచే అవకాశం కూడా కల్పించడంలేదు. దీంతో ప్రయివేటు స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయులు చాలా మంది వారి ఉపాధిని కోల్పోయారు.వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని నటి , కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు తెలంగాణలో ప్రయివేట్ టీచర్లు వీధినపడుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రతిష్టకు మచ్చగా మారింది. ప్రయివేట్ స్కూల్ టీచర్ల వ్యథ గురించి ప్రధాన మీడియాలోను, సోషల్ మీడియాలోను కుప్పలుతెప్పలుగా వార్తలు వస్తున్నప్పటికీ తెలంగాణ సర్కారు మాత్రం ఏమీ చలించడం లేదు. రాష్ట్రంలో చాలా ప్రయివేటు విద్యాసంస్థలు టీచర్లను ఇష్టమొచ్చినట్టు తొలగించి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. కొందరికి మాత్రం చాలీచాలని జీతాలిచ్చి ఇంకొందరికి అడ్మిషన్లు తెస్తేనే మీ ఉద్యోగం ఉంటుందని వార్నింగ్ ఇచ్చాయి. ఈ మధ్యే వచ్చిన వార్తలని గమనిస్తే ఒక ప్రయివేట్ స్కూలు టీచర్ ఉద్యోగం కోల్పోయి ఖమ్మంలో టిఫిన్ బండి పెట్టుకున్నారు. యాదాద్రిలో మరొక టీచర్ కూలీ పని చేస్తున్నారన్నారు.